పవన్ కళ్యాణ్ 2014 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలకు చాలా తక్కువ రోజుల వ్యవధి ఉన్న సమయంలో జనసేన అనే రాజకీయ పార్టీని స్థాపించారు. ఇక ఈయన పార్టీ స్థాపించిన చాలా తక్కువ రోజులకే ఎన్నికలు ఉండడంతో అభ్యర్థులను గుర్తించడం , వారికి సీట్లను కేటాయించడం , అలాగే ప్రచారాలను చేయడం ఇలా వీటన్నింటికీ ఎక్కువ సమయం లేదు అనే ఉద్దేశంతో పవన్ ఆ దఫా ఎన్నికలలో తన పార్టీని ఉంచలేదు. అదే సమయంలో 2019 వ సంవత్సరం వరకు పూర్తి గ్రౌండ్ వర్క్ చేసుకొని ఎవరిని ఏ ప్రాంతంలో నిలబెట్టాలి అని దానిపై పూర్తి క్లారిటీ తెచ్చుకొని అప్పుడు ఎలక్షన్లలో నిలబడతాం అని చెప్పాడు.
చెప్పినట్టుగానే 2019 సంవత్సరం జరిగిన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలలో జనసేన అభ్యర్థులను రాష్ట్రమంతటా అసెంబ్లీ మరియు పార్లమెంట్ స్థానాల్లో నిలబెట్టాడు. కానీ ఈ ఎన్నికలలో జనసేన పార్టీతో పాటు పవన్ కళ్యాణ్ కు కూడా భారీ దెబ్బ తగిలింది. జనసేన పార్టీ నుండి కేవలం ఒకే ఒక్క వ్యక్తి గెలుపొంది అసెంబ్లీ లో అడుగుపెట్టగా , పవన్ రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తే రెండింటిలో కూడా ఓడిపోయాడు. ఇక 2019 వ సంవత్సరం ఎన్నికలతో ఆలోచనలో పడ్డ పవన్ 2024 వ సంవత్సరం ఎన్నికలలో మాత్రం అలా జరగకుండా ఆచితూచి అడుగులు వేశాడు.
అందులో భాగంగా టిడిపి , బిజెపి తో పొత్తు పెట్టుకున్నాడు. ఈ పొత్తులో భాగంగా జనసేన కు 22 అసెంబ్లీ , 2 పార్లమెంట్ స్థానాలను మాత్రమే ఇచ్చారు. కాకపోతే జనసేన పోయినసారి ఎన్నికలతో పోలిస్తే ఈ సారి తన గ్రాఫ్ ను అమాంతం పెంచుకున్నట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్స్ విడుదల అయ్యాయి. అందులో చాలా సంస్థలు జనసేన పార్టీ ఈ సారి 14 నుండి 20 స్థానాల వరకు దక్కించుకునే అవకాశం ఉన్నట్లు , రెండు పార్లమెంట్ స్థానాలను దక్కించుకునే అవకాశం ఉన్నట్లు అంచనా వేశాయి. ఇదే కానీ నిజం అయితే ఒక సీటు నుండి ఏకంగా 20 సీట్ల వరకు పెంచుకున్న జనసేన అదిరిపోయే రేంజ్ లో ఎదిగినట్లే అవుతుంది. ఇలా జరిగితే 2029 సంవత్సరం ఎలక్షన్ వరకు ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన పెద్ద ఆశ్చర్యం లేదు అని జనసేన అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.