ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి దాదాపు పదేళ్లు గడిచింది. టీడీపీ కేవలం ఏపీకే పరిమితం అయింది. తద్వారా తెలంగాణలో ఆ పార్టీ దాదాపు కనుమరుగు అయింది. మరో వైపు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం వందల మంది బలిదానాలు చేసుకున్నారు. ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం సిద్ధించింది. జూన్ 2కి తెలంగాణ ఏర్పడి పదేళ్లు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక సంబరాలు చేసుకున్నారు. ఇక రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ, ఆంధ్ర తనకు రెండు కళ్లు అని చంద్రబాబు చెప్పారు.
రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాష్ట్రం కావడంతో ఏపీపైనే ఆయన ఎక్కువగా దృష్టి సారించారు. జూన్ 2న ఏపీలో సైతం గతంలో రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించే వారు. అయితే 2019 తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వం దీనిని పక్కన పెట్టేసింది. ఈ తరుణంలో జూన్ 2న చంద్రబాబు దీనిపై స్పందించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన తరుణాన్ని పురస్కరించుకుని రెండు రాష్ట్రాలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాలుగా వేరైనా తెలుగు వారంతా ఒకటేనన్నారు. అభివృద్ధిలో రెండు రాష్ట్రాలు ముందంజలో ఉండాలని ఆకాంక్షించారు. 2047 నాటికి ప్రపంచంలో భారత్ అగ్రగామిగా ఉండాలని, అందులో తెలుగు రాష్ట్రాలు తొలి స్థానంలో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టినట్లు చంద్రబాబు వివరించారు. ఆ ఆర్థిక సంస్కరణల ఫలితంగా సంపద సృష్టి జరిగిందన్నారు. సంపద సృష్టితో ఉమ్మడి రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి జరిగినట్లు పేర్కొన్నారు. తద్వారా ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకొచ్చినట్లు వివరించారు.
ఆర్థిక సంస్కరణ ఫలితాలు అందుకున్న తెలుగు వారంతా అభివృద్ధి చెందారన్నారు. ఏదేమైనా పేదరికం లేని సమాజం దిశగా ఏపీ, తెలంగాణ సాగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇక ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా ప్రపంచంలోనే దిగ్గజ టెక్ సంస్థలు హైదరాబాద్ రావడానికి ప్రయత్నించారు. ఫలితంగా బెంగళూరుతో ఐటీ పోటీ పడుతోంది. అంతేకాకుండా హైదరాబాద్లో వ్యాక్సిన్, ఇతర మందుల తయారీ కంపెనీలను ఒక చోట పెట్టి, జీనోమ్ వ్యాలీ ఏర్పడడానికి చంద్రబాబు కృషి చేశారు. దాని ఫలితం వల్ల కోవిడ్ సమయంలో వ్యాక్సిన్లు హైదరాబాద్లో తయారయ్యాయి. అంతేకాకుండా ఎన్నో ప్రముఖ కంపెనీలు, చిన్న కంపెనీలు ఏర్పడ్డాయి. లక్షల మందికి ఉపాధిని అందిస్తున్నాయి. ఇలా తెలంగాణకు హైదరాబాద్ నుంచే 80 శాతం ఆదాయం వస్తోంది. ఇందులో కొంతైనా క్రెడిట్ చంద్రబాబుకు దక్కుతుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.