జగన్ తరుపున అసెంబ్లీలో గొంతెత్తగల ఎమ్మెల్యేలు ఉన్నారా?

Suma Kallamadi
ఏపీలో ఇప్పటి వరకు అధికారంలో ఉన్న వైసీపీకి ఘోర పరాభవం ఎదురైంది. 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అయితే 2024 వచ్చే సరికి వైసీపీ ఎవరూ ఊహించని ఓటమి పాలైంది. కేవలం 11 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక గతంలో 2014లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీకి ప్రజలు 67 స్థానాలు ఇచ్చారు. ఆ సమయంలో వైసీపీ నుంచి గెలిచిన రోజా, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ వంటి వారు అసెంబ్లీలో వైసీపీ తరుపున తమ గళం ఎత్తే వారు. టీడీపీ నుంచి వచ్చే విమర్శలకు ధీటుగా బదులిచ్చే వారు. తమదైన విమర్శలతో అధికార పక్షంపై విరుచుకు పడేవారు. 

ముఖ్యంగా రోజా, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ వంటి వారు అసెంబ్లీలో తమ మైక్ కట్ చేసినా గట్టిగా అరుస్తూ టీడీపీ వారి సహనాన్ని పరీక్షించే వారు. అనంతరం 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ ముగ్గురికీ మంత్రి పదవులు దక్కాయి. వీరే కాకుండా వైసీపీ నుంచి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, పేర్ని నాని, అంబటి రాంబాబు, జోగి రమేష్ వంటి వారు సైతం వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రి పదవులు దక్కించుకున్నారు. వీరంతా ప్రస్తుత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు. ప్రస్తుతం ఎన్నికల్లో గెలిచిన వారు సైతం గట్టిగా అధికార పక్షాన్ని నిలదీయలేని వారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
అసెంబ్లీ ఫలితాల్లో వైసీపీ తీవ్రంగా నిరాశపరిచింది. ఆ పార్టీ నుంచి వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల నుంచి మరోసారి భారీ మెజార్టీతో గెలిచారు. గతంలో కంటే మెజార్టీ తగ్గినా పులివెందులలో ఆయన పట్టు సడలలేదు. ఆ తర్వాత మంత్రులందరూ ఓడిపోగా కేవలం పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మాత్రమే గెలిచారు. మిగిలిన ఎమ్మెల్యేల లిస్టును పరిశీలిస్తే తంబళ్లపల్లి నుంచి పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, మంత్రాలయం నుంచి వై బాలనాగిరెడ్డి, రాజంపేట నుంచి ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి, బద్వేల్ నుంచి దాసరి సుధ, ఆలూరు నుంచి విరూపాక్షి, యర్రగొండపాలెం నుంచి తాటిపత్రి చంద్రశేఖర్, దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, అరకు రేగం మత్స్యలింగం, పాడేరు మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరిలో టీడీపీ విధానాలను ఎండగడుతూ అసెంబ్లీలో గట్టిగా ప్రశ్నించే వారే కరువయ్యారని చర్చ సాగుతోంది. ఇలా అయితే ప్రతిపక్షంగా వైసీపీ ఎంత వరకు తన పాత్రను పోషిస్తుందోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: