చంద్రబాబు టీం: కొత్త మంత్రుల లిస్ట్ ఇదే... ఈ పేర్లు.. ట్విస్టులు చూశారా..!
- కత్తిమీద సాములా మారనున్న కేబినెట్ కూర్పు
- సామాజిక, ప్రాంతీయ సమీకరణ బ్యాలెన్సింగ్ ఎలా చేస్తారో ?
( అమరావతి - ఇండియా హెరాల్డ్ )
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోంది. చంద్రబాబు కూటమి తరపున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఈ సారి బాబు కేబినెట్‌లో ఎవరెవరు ? మంత్రులు అవుతారు అన్నది చూస్తే చాలా ట్విస్టులు ఉండబోతున్నాయంటున్నారు. సీనియర్లను కాదని ఈ సారి క్లీన్ ఇమేజ్ ఉన్న వారికి, యువకులకు, మహిళలకు, బీసీలకు, కొత్త తరానికి ఎక్కువ అవకాశం ఉంటుందని అంటున్నారు. ఈ సారి బీజేపీ, జనసేన కూడా ఉండడంతో వారికి ఎన్నెన్ని బెర్త్‌లు కేటాయిస్తారు ? అన్నది కూడా సస్పెన్స్‌గా మారింది.
మహిళల పరంగా చూస్తే తంగిరాల సౌమ్య, వంగలపూడి అనిత పేర్లు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. ఇక సీనియర్ల నుంచి శ్రీకాకుళం నుంచి అచ్చెన్నాయుడు, కూన రవికుమార్ రేసులో ఉన్నారు. వీరిద్దరు బీసీలే. విజయనగరం నుంచి బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ, సీనియర్ కళా వెంకట్రావు, కోండ్రు మురళీ ఎస్సీ కోటాలో పదవులు ఆశిస్తున్నారు. అయితే ఓసీలు ఎక్కువ మంది ఉండడంతో సుజయ్‌కృష్ణకు ఛాన్సులు కాస్త తక్కువే.
విశాఖ జిల్లా నుంచి గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, పల్లా శ్రీనివాస్ రేసులో ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి యనమల ( గాజువాక ఎమ్మెల్యే పల్లా లేదా యనమలలో ఒకరికి మాత్రమే) , చినరాజప్ప లేదా జ్యోతుల నెహ్రూలలో ఒకరికి అవకాశం ఉంటుంది. బుచ్చయ్య చౌదరి రేసులో ఉన్నా కమ్మలు ఇప్పటికే ఎక్కువ మంది ఉండడంతో బుచ్చయ్యకు ఛాన్స్ లేకపోవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడుతో పాటు రఘురామ కృష్ణంరాజు ఉన్నా రాఘురామకు స్పీకర్ అవకాశం ఉందంటున్నారు.
కృష్ణాలో పోటీ ఎక్కువే ఉంది. కమ్మ కోటాలో గద్దే రామ్మోహన్, కాపుల నుంచి బొండా ఉమా, బీసీ కోటాలో పార్థసారథి, కొల్లు రవీంద్ర, వైశ్య కోటాలో శ్రీరామ్ తాతయ్య రేసులో ఉన్నారు. ఇక్కడ ఎవరికి వస్తుందో ? అన్నది ఈక్వేషన్ కష్టమే. మరి బీజేపీ కోటాలో కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి ఇద్దరూ రేసులో ఉన్నారు. ఇక గుంటూరు జిల్లా నుంచి కాపు కోటాలో కన్నా లక్ష్మీనారాయణ, ఎస్సీ కోటాలో నక్కా ఆనంద్‌బాబు, తెనాలి శ్రావణ్‌కుమార్ ఉన్నారు. జనసేన నుంచి కమ్మ కోటాలో నాదెండ్ల మనోహర్ ఉన్నారు.
ప్రకాశం జిల్లా నుంచి కమ్మ వర్గానికి చెందిన గొట్టిపాటి రవికుమార్‌కు బెర్త్ ఖాయం అంటున్నారు. ఎస్సీ కోటాలో డోల బాల వీరాంజనేయస్వామి కూడా ఉన్నారు. నెల్లూరు జిల్లా నుంచి ఆనం రామనారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీథర్ రెడ్డి ముగ్గరిలో ఇద్దరికి అవకాశం ఉందంటున్నారు. చిత్తూరు జిల్లా నుంచి అమర్‌నాథ్ రెడ్డి, ఎస్సీ కోటాలో ఒకరికి అవకాశం అంటున్నారు. అనంతపురం జిల్లా నుంచి పయ్యావుల కేశవ్, కాలువ శ్రీనివాసుల పేర్లు ఉన్నాయి. ఈ సారి పరిటాల సునీతకు అవకాశం లేనట్టే. ఇక కడప జిల్లా నుంచి సుధాకర్ యాదవ్, మాధవీరెడ్డి, ఎమ్మెల్సీ రామ్‌గోపాల్ రెడ్డి పేర్లు లైన్లో ఉన్నాయి. కర్నూలు నుంచి బీసీ జనార్థన్ రెడ్డి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి రేసులో ఉన్నారు. మైనార్టీ కోటాలో కొందరు గెలిచినా సీనియర్‌గా ఉన్న నంద్యాల ఎమ్మెల్యే ఫరూఖ్ పేరు వినిపిస్తోంది.
జనసేన లెక్కేంటి...
జనసేన అధ్యక్షుడు పవన్ మంత్రి వర్గంలో చేరతారా లేదా ? అన్నది క్లారిటీ లేదు. ఆయన మంత్రి వర్గంలో చేరితే ఆయన స్థాయికి తగిన శాఖతో పాటు ఉపముఖ్యమంత్రి పదవి తీసుకోవాలి. ఇక జనసేన నుంచి కమ్మ, కాపు, బీసీ, ఎస్సీ / ఎస్టీ ఇలా నాలుగు మంత్రి పదవులు ఇవ్వవచ్చంటున్నారు.
బీజేపీకి ఎన్ని పదవులు...
ఈ సారి బీజేపీ నుంచి నలుగురు గెలిచినా కూడా ఇద్దరికి మాత్రమే అవకాశం అంటున్నారు. వీరిలో సుజనా, కామినేని రేసులో ఉన్నారు. వీరిద్దరు కమ్మలే కావడంతో ఒకరికే అవకాశం ఉంటుంది. ఇక సత్యకుమార్, పార్థసారథి కూడా రేసులో ఉన్నారు. ఏదేమైనా ఈ సారి కేబినెట్ కూర్పు.. సామాజిక వర్గాలు, ప్రాంతాలు బ్యాలెన్స్ చేసుకోవడంతో పాటు మూడు పార్టీలను కలుపుకుని కూర్పు చేయడం బాబుకు కత్తిమీద సామే అనుకోవాలి.