అన్న దారుణ ఓటమి.. చెల్లికి ఎలా ప్లస్ అవుతోంది...!
- జగన్ దగ్గర ఇమడలేని సీనియర్ల చూపు కాంగ్రెస్ వైపు
- పెరిగిన కాంగ్రెస్ ఓటు బ్యాంకు...
- ఐదేళ్లలో షర్మిల కష్టపడితే మరింత ప్లస్
( విజయవాడ - ఇండియా హెరాల్డ్ )
ఒక గెలుపు అనేక అవకాశాలకు దారి తీస్తుంది. అదేవిధంగా ఒక ఓటమి కూడా.. అనే పరిణామాలకు దారి తీస్తుంది. అవి మంచి కైనా కావచ్చు.. చెడుకైనా కావొచ్చు. ఇది .. ఎటు దారితీస్తుంది.. అనేది మాత్రం ఖచ్చితంగా కాలమే నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఏపీలో ఇలాంటి పరిణామమే ఎదురు కానుంది. వైసీపీకి ఎదురైన ఘోర పరాజయం అంతా ఇంతా కాదు. అతిరథులు అనదగిన నాయకులు.. తమకు తిరుగులేదన్న కంచుకోటల వంటి నియోజకవర్గాల్లోనూ వైసీపీ తుడిచి పెట్టుకుపోయింది. 2019నాటి ప్రభంజనాన్ని సృష్టించిన వైసీపీ అంతే ప్రభంజన వీచికలో 2024 ఎన్నికల్లో కొట్టుకుపోయింది.
మొత్తంగా 11 స్థానాలలో మాత్రమే వైసీపీ విజయం దక్కించుకుంది. వీరిలో ఎక్కువ మంది వీరవిధేయులే కాబట్టి ఢోకా లేదు. జంపింగులు కూడా ఉండవు. కానీ, ఎటోచ్చీ.. ఇప్పుడు ఓడిన వారితోనే సమస్య. ఎందుకంటే.. ఓడిన వారిలో అతిరథ మహా రథులు వున్నారు. రాజకీయ చాణక్యులు ఉన్నారు. బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఆర్కే రోజా వంటి అనేక మంది ఉన్నారు. వీరంతా కూ డా.. పొరుగు పార్టీల నుంచి వచ్చినవారే. వీరే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా 100 మందికిపైగా సీనియర్లు ఉన్నారు. వీరి పరిస్థితి ఇప్పుడు అడకత్తరలో పడింది.
ఎందుకంటే.. వ్యాపారాలు.. వ్యవహారాలు వంటివి సవ్యంగా సాగాల్సిన అవసరం వీరికి ఉంది. దీంతో వీరు అయితే.. అధికారంలో అయినా.. ఉండాలి. లేదా తటస్థ పార్టీల్లో అయినా ఉండాలి. మరోవైపు.. వీరిని ఎలానూ అధికార పార్టీ కూటమి చేర్చుకునే అవకా శం లేదు. దీంతో వారు అటు వెళ్లరు. ఇక, మిగిలింది.. కాంగ్రెస్. తాజా ఎన్నికల్లో ఈ పార్టీ ఓవరాల్ ఓటింగ్ శాతం 1.5 చొప్పున పెరి గింది. గత ఎన్నికల్లో కేవలం 1 శాతమే ఉన్న ఈ పార్టీ ఇప్పుడు 3 శాతానికి పెరిగింది. పైగా.. వైఎస్ కుమార్తెగా షర్మిల దూకుడు ప్రదర్శిస్తూనే ఉన్నారు.
ఈ నేపథ్యంలో కనీసం ఈ ఐదేళ్లపాటు తలదాచుకునేందుకు లేదా.. తటస్థ పార్టీలో ఉండేందుకు.. వైసీపీలో ఓడిపోయిన నాయకు లు అటు చూసే అవకాశం ఉంది. ఇది నాణేనికి ఒక కోణం. మరోవైపు.. పుంజుకునేందుకు రెడీ అయిన.. కాంగ్రెస్ కూడా.. వైసీపీ ఓటమి తర్వాత.. తన పాత నాయకులకు వలవేసేందుకు ప్రణాళికలు రెడీ చేసింది. ఇక్కడ కూడా కీలకమైన కారణం కనిపిస్తోం ది. వైసీపీ అధినేత జగన్.. పై నమోదైన కేసుల విచారణ పెరుగుతోంది. దీంతో వచ్చే ఆరు లేదా.. 10 మాసాల్లోనే ఆయన పరిస్థితి ఇబ్బందిగా మారే ఛాన్స్ కనిపిస్తోంది. ఇదే జరిగితే పార్టీ మరింత చిక్కుల్లో పడుతుంది.
ఇటు అధికార పక్షం కూడా.. వైసీపీని టార్గెట్ చేయడం ఖాయం. మొత్తంగా చూస్తే.. వైసీపీ చిక్కులు అంతా ఇంతా అన్నట్టుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ సీనియర్లు.. పాత కాంగ్రెస్ నాయకులను తమ వైపు తిప్పుకోనేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేసే చాన్స్ కనిపిస్తోందని ఢిల్లీ వర్గాలు భావిస్తున్నాయి. ఏదేమైనా.. వైసీపీ ఘోర ఓటమి పార్టీపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది.