రామోజీ రావు మరణంపై జగన్ ట్వీట్..!

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు (88) తెల్లవారుజామున 4:30 గంటలకు కన్నుమూశారు . ఇటీవల రామోజీరావు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా చికిత్స పొందుతూ నేడు మరణించారు. రామోజీరావు పార్థివదేహాన్ని రామోజీ ఫిలింసిటీ లోని ఆయన నివాసానికి తరలిస్తున్నారు . కాగా ఆయన మృతిపై పలువురు రాజకీయ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. ప్రధాని మోడీ రామోజీరావు మృతి పై సంతాపం ప్రకటిస్తూ ఆయనకు దేశంపై ఎంతో ప్రేమ ఉందని పేర్కొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు రామోజీరావు మృతిపై తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 

ఆయనతో తనకున్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. మరోవైపు అన్ని పార్టీల ప్రముఖులు సైతం రామోజీరావు మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు . ఈ నేపథ్యంలోనే ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రామోజీరావు మృతి పై సంతాపం తెలిపారు. సోషల్ మీడియాలో జగన్.... రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను . ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అని పేర్కొన్నారు. అయితే జగన్ సంతాపం ప్రకటించడంపై టీడీపీ శ్రేణులు విమర్శలు కురిపిస్తున్నారు. వృద్ధాప్యంలో జగన్ రామోజీరావును ఇబ్బంది పెట్టారని ఆరోపిస్తున్నారు.

ఇప్పుడు రామోజీరావు మృతి పట్ల సంతాపం తెలపాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఇక రామోజీ రావు కేసు విషయానికి వస్తే మార్గదర్శి చిట్ ఫండ్స్ లో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆయనపై కేసు నమోదు అయింది. ఏపీ సిఐడి రామోజీరావుకు సంబంధించిన పలు శాఖల్లో సోదాలు నిర్వహించింది. ఈ కేసులో అనేకసార్లు ఆయన్ను విచారించింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ కు సంబంధించిన కొంతమంది ఉద్యోగులను సైతం అరెస్టు చేసింది. ఈ కేసును జగన్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. సీఎం జగన్ బహిరంగంగానే రామోజీరావును విమర్శించారు. ఈ నేపథ్యంలోనే టిడిపి శ్రేణులు జగన్ సంతాపం తెలపడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: