రివేంజ్ పాలిటిక్స్ చేసేవారు మట్టిలో కలిసిపోతారు జాగ్రత్త!

Suma Kallamadi
ఆధునిక భారత రాజకీయం చెబుతున్నది ఒక్కటే. రివేంజ్ పాలిటిక్స్ చేసేవారికి పుట్టగతులు ఉండవని. అవును, అది చాలా స్పష్టంగా నేడు రుజువయ్యింది కదా ఆంధ్రాలో. 2019లో గద్దెనెక్కిన వైసీపీ ప్రభుత్వం అప్పటి ప్రతిపక్షం అయినటువంటి టీడీపీ కార్యకర్తలు, నాయకులు, యంత్రాంగంపైన విరుచుకు పడింది. ఇక ప్రశ్నించిన జనాలను సైతం ఉపేక్షించలేదు. ఎన్నో నేరాలు, ఘోరాలు జరిగాయి. కట్ చేస్తే తాజా ఎన్నికల ఫలితాలలో ఏపీ ప్రజలు వారికి ఎటువంటి బుద్ధి చెప్పారో అందరికీ తెలిసిందే. అయితే దానిని గమనించి నేడు గద్దెనెక్కిన టీడీపీ ప్రభుత్వం ఆచి తూచి అడుగులేయాల్సింది పోయి రివర్స్ లో రివేంజ్ పాలిటిక్స్ కి దిగడం జరుగుతోంది. ఇది సమాజానికి అంత మంచిది కాదని విశ్లేషకులు చెబుతున్నారు.

అవతల వారిని ఏదో చేద్దామనుకుని బరిలోకి దిగే వారు ఖచ్చితంగా మట్టిలో కలసిపోతారు. ఇక్కడ ప్రతి ఒక్కరికీ కాలమే సమాధానం చెబుతుంది. ఈ నీతి సూత్రాన్ని వంటబట్టించుకుంటేనే ఎవరైనా పది కాలాల పాటు చల్లగా రాజకీయాలు చేసుకుంటారు... లేదంటే అంతే. ఇంకా లోతుగా వెళితే... పుష్కర కాలం కిందట కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉమ్మడి ఏపీలో తనకు బలం ఉందని భావించి అధికార గర్వంతో జగన్ ని జైలులో పెట్టించగా దాదాపు 16 నెలల పాటు జగన్ జైలులో ఉన్నారు. ఆ తరువాత జగన్ బయటకు వచ్చి తనదైన శైలిలో ఏపీలో కాంగ్రెస్ అన్న పార్టీయే లేకుండా తొక్కి పెట్టి జగన్ పైకి ఎదిగారు.

ఇక లేటెస్ట్ ఉదాహరణ తీసుకుంటే ఎన్నికలకు సరిగ్గా 6 నెలల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబుని జగన్ అరెస్ట్ చేయించి 53 రోజుల పాటు జైలులో ఉంచారు. కట్ చేస్తే చంద్రబాబు జైలు నుంచి బయటకు వస్తూనే రెట్టింపు బలంతో జనంలోకి వెళ్లారు. అదే ఎన్నికల్లో పూర్తిగా ఫలించి టీడీపీ చరిత్రలో కనీ వినీ ఎరుగని మెజారిటీలు సాధించాయి. జగన్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలి వైసీపీ ఇపుడు భూస్థాపితం అయింది. రివెంజ్ పాలిటిక్స్ చేస్తే దక్కే ఫలితం ఇది అని మరోసారి రుజువు అయింది కదా. ఇలాంటి పరిణామాల తరువాత కూడా నేతలు ఎవరికి వారు ఆలోచించుకుంటే బావుంటుంది. తాజాగా టీడీపీ అధికార మదంతో వైసీపీ శ్రేణులపైన చేస్తున్న దాడులు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందనే విషయం ఇట్టే అవగతం అయిపోతుంది. ఇప్పటికైనా నేతలు అటువంటి చర్యలు మాని పూర్తిగా రాష్ట్రాభివృద్ధికి తోడ్పడితే జనాలకు మేలు చేసేవారు అవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: