ఏపీ: చంద్రబాబులో ఈ అనూహ్య మార్పుకి కారణం ఏమిటో?
చంద్రబాబుకున్న గత అలవాట్లు ప్రకారం చూసుకుంటే ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే ఆయన పార్టీ నేతలతో విడివిడిగా సమావేశం అయ్యేవారు. అలా ఒంటరిగా కలిసి తమ ఇష్టాల్ని తమ ఆకాంక్షల్ని తనకు చెప్పేందుకు వీలుగా చంద్రబాబు పార్టీ నేతలకు అవకాశం ఇచ్చేవారు. కానీ.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించటం మనం గమనించవచ్చు. ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన తరువాత చంద్రబాబును కలిసేందుకు ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులంతా క్యూ కట్టడం జరిగింది. అలా అందరిని గ్రూపుగానే కలిశారే తప్పించి.. విడిగా కలిసేందుకు ఏ ఒక్కరికి అవకాశం ప్రస్తుతం ఇవ్వలేదు. దాంతో గతానికి భిన్నంగా ఈసారి చాలా విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం కనబడుతోంది.
ఏదిఏమైనా ఇకనుండి తమ మంత్రివర్గం వారిని బాబు అదేవిధంగా గుంపుగా కలుస్తారే తప్పితే ఒంటరిగా ఏ ఒక్కరినీ కలవరని గుసగుసలు వినబడుతున్నాయి. అంటే అలా గుంపుగా కలిసినపుడు విషయాలు చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటాయని, ఏ ఒక్కరికీ ఎలాంటి అనుమానం ఉండదని బహుశా అలా బాబు ప్లాన్ చేసి ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే బాబు ప్రతి సందర్భంలోనూ 20-30 మంది సమక్షంలోనే మాట్లాడుతున్నారు తప్పితే విడిగా ఎవరినీ కలవడం లేదని అనుకుంటున్నారు. ఇది చంద్రబాబులో వచ్చిన స్పష్టమైన మార్పుగా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.