ఏపీ సీఎంగా బుధవారం ప్రమాణస్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడుకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అభినందనలు తెలిపారు. కొత్త పాలనలో సంక్షేమం, అభివృద్ధి, భద్రత కలగలిసి ప్రజాహిత పాలన అందిస్తామనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సీఎంకు రాసిన లేఖలో షర్మిల కీలక విషయాలను ప్రస్తావించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ధ్వంసం చేయడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి దాడులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించడమే కాకుండా రాష్ట్ర ప్రగతికి విఘాతం కలిగిస్తాయని ఆమె పేర్కొన్నారు.
“గత ఐదేళ్లలో పాలనాపరమైన లోపాలతో రాష్ట్రం అనేక విధాలుగా నష్టపోయింది. తిరిగి రాష్ట్ర అభివృద్ధిని ట్రాక్‌లో పెట్టాలి. రాష్ట్ర పునర్నిర్మాణం అనేక సవాళ్ల మధ్య వేగంగా, అంకితభావంతో ముందుకు సాగాలి. ఇలాంటి తరుణంలో మాజీ సీఎం వైఎస్ఆర్ విగ్రహాలపై, ప్రతిపక్షాలపై దాడులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. అనుభవాన్ని, నిష్పాక్షికతను ఉపయోగించి పరిస్థితిని చక్కదిద్దాలని కొత్త పాలకవర్గాన్ని కోరుతున్నాను. రాష్ట్ర ప్రగతిలో కాంగ్రెస్ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుంది' అని షర్మిల పేర్కొన్నారు.
తన తండ్రి, మాజీ సీఎం దివంగత వైఎస్ విగ్రహాలను కొందరు రాజకీయ ప్రత్యర్థులు లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేశారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలకు అవకాశం కల్పించడం బాధాకరమని ఆమె వాపోయారు. దీనిపై ఆమె ట్వీట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి ‘పిరికిపంద చర్యలను’ అనుమతించబోమని ఆమె పునరుద్ఘాటించారు. తెలుగు ప్రజల హృదయాలను ఏలిన ప్రజానాయకుడు వైఎస్‌ఆర్ అని, ఆయన చెరగని జ్ఞాపకాలను మిగిల్చారని ఆమె అన్నారు.
ఇలాంటి నీచ రాజకీయాలను వైఎస్ఆర్ లాంటి వారికి ఆపాదించడం తగదని, ఇలాంటి చర్యలకు బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఆవరణలో రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తొలగించారు. యూనివర్సిటీలలో రాజకీయ నేతల విగ్రహాలు సరికాదని విద్యార్థి సంఘాలు అభ్యంతరం తెలపడంతో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఇటీవల తొలగించాల్సి వచ్చింది. అంతేకాకుండా రాష్ట్రంలో పలు చోట్ల వైఎస్ఆర్ విగ్రహాలకు టీడీపీ నాయకులు తమ పార్టీ కండువాలను కప్పారు. కొన్ని చోట్ల విగ్రహాల ధ్వంసం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో తన తండ్రి విగ్రహాలను ఇలా ధ్వంసం చేయడం తట్టుకోలేక చంద్రబాబుకు షర్మిల ఇలా లేఖ రాశారు. దీంతో పాటు వైసీపీ నేతలపైనా దాడిని ఆమె ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను గాడిలో పెట్టాలని కోరారు.