సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఎన్నికల్లో టిడిపి కూటమి ఘన విజయం సాధించడంతో గత ప్రభుత్వం హయాంలో పదవులు పొందిన వారిని తొలగించి తమపార్టీ నేతలకు అందలం ఎక్కించాలని టిడిపి సీనియర్ నేతలు ప్రయత్నిస్తున్నారు.ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కన్ను గుంటూరు కార్పోరేషన్ పై పడింది. మరో ఏడాదిన్నర ఆగడం కంటే ఇప్పుడే మేయర్ పదవి దక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభిచింది.అవిశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చి వైసిపి మేయర్ ను దించే యత్నాలు చురుగ్గా సాగుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది.గుంటూరు కార్పొరేషన్‌లో ఏడుగురు కార్పొరేటర్లు ఇప్పటీకే టిడిపిలో చేరారు.57 మంది కార్పొరేటర్లు ఉండగా వారిలో 9 మంది టిడిపి వారున్నారు. ఇటీవల ఏడుగురు వైసిపి కార్పొరేటర్లు టిడిపిలో చేరారు. దీంతో టిడిపి బలం 16కు పెరిగింది. మరో 10 మందిని సమీకరిస్తే మేయర్ కావటి మనోహర్ నాయుడ్ని పదవి నుంచి తొలగించాలని టిడిపి నగర నాయకులు యోచిస్తున్నారు.ఎక్స్‌అఫిషియో మెంబర్లుగా ఉన్న ఎంపి, ఎమ్మెల్యేలు టిడిపి నుంచి ఎన్నిక కావడంతో టిడిపి బలం ఇప్పటికే భారీగా పెరిగింది. మరో 10 మంది కార్పొరేటర్లు టిడిపిలోకి వస్తే మేయర్ పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది.
వైసిపి నుంచి టిడిపిలోకి వెళ్లేందుకు ఇష్టపడని కార్పొరేటర్లు జనసేన, బిజెపిలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే గతంలో మేయర్ కావటితో పాటు పలువురు కార్పొరేటర్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడంతో వీరిని జనసేనలోకి చేర్చుకుందుకు పవన్ కల్యాణ్ సిద్ధంగా లేరని చెబుతున్నారు.గుంటూరు మేయర్‌గా వైసీపీ నేత కావటి మనోహర్ నాయుడు ఉన్నారు. కావటిపై సొంతపార్టీలోనే అసంతృప్తి ఉంది. మేయర్‌కి మొన్నటి ఎన్నికల్లో చిలకలూరిపేట అభ్యర్ధిగా వైసీపీ అధిష్ఠానం అవకాశమిచ్చింది. అయితే మనోహర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. వైసీపీ అధికారానికి దూరం కావటంతో పార్టీ కార్పొరేటర్లపై కావటి మనోహర్‌కి పట్టు తగ్గింది.ఈనెలాఖరుకి లేదంటే వచ్చే నెల మొదట్లో కౌన్సిల్ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈలోపే కార్పొరేటర్లతో మంతనాలు జరిపి తమవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో పడ్డారు అధికారపార్టీ ముఖ్య నేతలు. చూస్తుంటే కావటికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయినట్లే కనిపిస్తోంది.