ఆనంద్ బాబుకు ఆ ఆనందం దక్కలేదుగా.. బాబు అందుకే మంత్రి పదవి ఇవ్వలేదా?

Reddy P Rajasekhar
ఏపీకి చెందిన ప్రముఖ రాజకీయ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కీలకమైన నియోజకవర్గాలలో వేమూరు ఒకటి కాగా 2009, 2014 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆనంద్ బాబు 2019 ఎన్నికల్లో ఓటమిపాలైనా 2024 ఎన్నికల్లో మాత్రం మరోమారు ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటారు.
 
గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆనంద్ బాబు ఎస్సీ & ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రిగా పని చేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో సైతం భారీ మెజార్టీతో ఆనంద్ బాబు గెలిచిన నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని అందరూ భావించినా అందుకు భిన్నంగా జరిగింది. వేమూరు ఎస్సీ నియోజకవర్గం కాగా ఈ నేతకు పదవి దక్కకపోవడానికి పరోక్షంగా కొండపి ఎమ్మెల్యే కారణమని సమాచారం.
 
ఎస్సీ రిజర్వ్డ్ కొండపి నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల్లో డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఈ ఎమ్మెల్యే వరుసగా మూడుసార్లు గెలిచిన నేపథ్యంలో బాబు ఆనంద్ బాబు, వీరాంజనేయస్వామిలలో వీరాంజనేయస్వామికే బాబుమంత్రి పదవి ఇవ్వడానికి ఆసక్తి చూపినట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ఏపీలో జగన్ వేవ్ ఉండగా ఆ సమయంలో కూడా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఎమ్మెల్యేగా గెలవడం ఆయనకు ప్లస్ అయిందని సమాచారం.
 
నక్కా ఆనంద్ బాబుకు మంత్రి పదవి దక్కకపోవడం ఆయన అనుచరులను, అభిమానులను ఒకింత బాధ పెట్టింది. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి పలువురు నేతలకు కేంద్రంలో, రాష్ట్ర కేబినేట్ లో చోటు దక్కడం కూడా నక్కా ఆనంద్ బాబుకు మంత్రి పదవి దక్కకపోవడానికి ఒక కారణమని చెప్పవచ్చు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి బీఎల్ పూర్తి చేసిన నక్కా ఆనంద్ బాబు వేమూరు అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: