ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014 వ సంవత్సరం విడిపోయాయి. విడిపోయిన తర్వాత ఆంధ్ర, తెలంగాణ మధ్య సంబంధాలు ఎలా ఉంటాయో అని ఎంతో మంది భావించారు. ఇక విడిపోయిన తర్వాత 2014 వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగా, తెలంగాణలో చంద్రశేఖర రావు ముఖ్యమంత్రి అయ్యారు. వీరిద్దరి మధ్య మొదటి నుండి కూడా పెద్దగా సఖ్యత లేదు. ఆ తర్వాత 2019 వ సంవత్సరం ఎన్నికలకు ముందు కేసీఆర్ పరోక్షంగానే జగన్ ను సపోర్ట్ చేస్తూ వచ్చాడు. అలాగే 2019 లో ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ ముఖ్యమంత్రి కాగా, తెలంగాణలో మరోసారి చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అయ్యారు.
వీరిద్దరి మధ్య కొంతకాలం మంచి స్నేహ బంధమే కొనసాగింది. కానీ ఆ బంధం కొంతకాలానికే తగ్గిపోయింది. ఇక 2023 వ సంవత్సరం తెలంగాణలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దానితో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. 2024 వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు.
గతంలో తెలుగుదేశం పార్టీ నేతలలో రేవంత్ రెడ్డి ఒకరు కావడం, అలాగే చంద్రబాబు తన గురువు అని రేవంత్ ఎన్నో సందర్భాలలో చెప్పడంతో ఆంధ్రాలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడం తెలంగాణలో రేవంత్ ముఖ్యమంత్రిగా ఉండడంతో ఈ ఐదు సంవత్సరాలు కూడా ఆంధ్ర తెలంగాణ మధ్య సంబంధాలు ఎంతో దూరంగా ఉంటాయి అని జనాలు భావిస్తున్నారు. మరి ఇలానే ఉంటాయా అంటే చెప్పలేం. రాజకీయ పరిణామాలు ఈ సమయంలో ఎలా మారుతాయో ఎవరూ చెప్పలేం.
కొంత కాలం క్రితం రేవంత్ రెడ్డిని మీరు చంద్రబాబు నాయుడు శిష్యుడు కదా అని అడిగినప్పుడు ఆయన గురువు ఎవరు... శిష్యుడు ఎవరు. నేను ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఆయన పార్టీలోకి వెళ్లాను. నేను ఆయన సహచరుడుని మాత్రమే. ఆయన అంటే నాకు అపారమైన గౌరవం ఉంది అని చెప్పాడు. ఇక ఒకప్పటి అనుబంధాలు వేరు... రాజకీయాలు వేరు అని దీనితోనే అర్థం అవుతుంది. మరి ప్రజలు అంతా అనుకున్నట్లు వీరిద్దరూ ముఖ్యమంత్రులుగా ఉండడం వల్ల ఆంధ్ర తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందా లేదా అనేది కాలమే నిర్ణయించాల్సి ఉంది.