అరెయ్.. పిల్లోడా.. అన్నచోటే పెద్దోడయ్యాడు.. ఇది రామ్మోహన్‌కు మాత్రమే సాధ్యం..!
- అవమానించిన పార్లమెంటులోనే నేడు కేంద్ర కేబినెట్ మినిస్టర్
- విజయాల రారాజు ఈ కింజారపు వారసుడు
( ఉత్తరాంధ్ర - ఇండియా హెరాల్డ్ )
కాలం చిత్రమైంది. నిన్న ఉన్నట్టు నేడు ఉండదు. మొన్న ఉన్నట్టుగా నిన్న కూడా ఉండదు. ఓడలు బళ్లవుతాయి.. బళ్లు ఓడలు అవుతాయి. ఇప్పుడు టీడీపీ విషయంలోనూ ఇదే జరిగింది. ముఖ్యంగా పార్లమెంటు లో అవమానాలు ఎదుర్కొన్న యువ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు విషయంలో కాలం సరైన సమాధానం చెప్పింది.గత పార్లమెంటులో సంఖ్యా బలం ఎక్కువగా ఉండడంతో వైసీపీ దూకుడు ప్రదర్శించింది.
అయితే.. ఇది రాష్ట్రానికి మేలు చేయకపోగా.. దూకుడు.. పార్టీ ఎంపీల్లో పొగరు పెంచేసిందనే విమర్శలు వున్నాయి. టీడీపీ ఎంపీలను అవమానించడం.. వారిని పార్లమెంటులోనేదూషించడం అనేక సందర్భాల్లో మనకు కనిపించింది. కింజరాపు రామ్మోహన్ నాయకుడు ఏ సమస్య పై నైనా ప్రస్తావన చేస్తున్న సమయంలో వైసీపీ ఎంపీల నుంచి ప్రతిఘటన ఎదుర్కొన్నారు. ముఖ్యంగా అప్పటి వైసీపీ ప్రభుత్వం అప్పులు ఎక్కువగా చేస్తోందని.. నిలువరించాలని రామ్మోహన్ గట్టిగా మాట్లాడారు.
ఆయన ఎప్పుడు ఏ అంశం మాట్టాడినా.. వైసీపీ ఎంపీలుగా ఉన్న మిధున్‌రెడ్డి, నందిగం సురేష్, గోరంట్ల మాధవ్ వంటివారు.. అడ్డు తగిలేవారు. ఒకానొక సందర్భంలో అయితే..`అరెయ్ కూర్చో నువ్వు.. పుడింగిలా లేచావు. ఇంక చాల్లే మాట్టాడింది! కూర్చోరా నాయనా.. కూర్చో` అంటూ.. మిధున్ రెడ్డి వ్యాఖ్యానిస్తే.. నందిగం సురేష్ మరింత దూకుడుగా.. `అరెయ్.. ఇంకేం మాట్లాడతావు కానీ.. చేపల పులుసు రెడీ అయిందంట ఎళ్లి తిను` అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
కానీ, కాలం ఇక్కడే తిరగబడింది. ఇలా.. రామ్మోహన్‌ను పరాచికంగా మాట్లాడి అవమానించిన వారు.. అడ్రస్ లేకుండా పోయారు. ఆయనను తిట్టిన వారు దూషించిన వారు.. ఓడిపోయారు. ఒక్క మిథున్‌రెడ్డి తప్ప. కానీ, అదే రామ్మోహన్ మరిన్ని మెట్లు ఎక్కి.. కేంద్ర మంత్రి అయ్యారు. నేడు వారి ముందు ఆయన కేంద్ర మంత్రిగా పార్లమెంటులో మాట్లాడితే.. ఎలా ఉంటుందనేది అందరూ ఊహించుకోవచ్చు. సగర్వంగా ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికైన ఆయన.. కేంద్ర మంత్రి పదవిని చేపడితే.. ఆయనను తిట్టిన వారు మాత్రం.. బిక్కిబిక్కు మంటూ కూర్చునే పరిస్థితి వచ్చింది. ఇదీ.. కాల మహిమ అంటే!