కొమ్మాలపాటి శ్రీధర్ - ఆలపాటి రాజా : సీనియర్ నాయకుల కృషికి తగ్గ ఫలితమేది చంద్రన్న
•ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆలపాటికి మంచి పదవి దక్కుతుందా?
( ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్ ): కూటమి ఘన విజయం సాధించి ప్రభుత్వంగా ఏర్పడింది. అయితే కూటమిలో చాలా మంది కొత్తవారికి మంత్రి పదవులు దక్కాయి. కానీ కొంతమంది సీనియర్ నేతలకు ముఖ్య నేతలకు మాత్రం న్యాయం జరగలేదు. ఎన్నికల ముందు వారు పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. ఎన్నో త్యాగాలు చేశారు. ఇప్పుడు టీడీపీ కూటమి ఘన విజయం సాధించి అధికారం లోకి వచ్చేసింది. తమకు న్యాయం చేస్తారని కోటి ఆశలతో కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు ఆ నేతలు. ఎన్నికల్లో పొత్తుల వల్ల టీడీపీ, బీజేపీ, జనసేనకు చెందిన చాలా మంది నేతలు సీట్ల త్యాగాలు చేశారు. కేవలం సీట్లు వదులుకున్న వారు మాత్రమే కాదు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బలమైన వాయిస్ వినిపించిన వారు ఇంకా కష్టపడిన నేతలు కూడా... ఇప్పుడు కూటమి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వేళ నామినేటెడ్ పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అలాంటి నేతల్లో కొమ్మాలపాటి శ్రీధర్, ఆలపాటి రాజా ఉన్నారు. వీళ్ళు చాలా బలమైన నేతలు.
పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ కాగా, ఆయన పెదకూరపాడు నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెదకూరపాడు నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నూర్జహాన్ పై 9878 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.అలాగే 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడుపై 9196 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.కానీ 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెదకూరపాడు నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి నంబూరి శంకర్ రావు చేతిలో 14104 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. పార్టీ కోసం ఎంతో పాటు పడ్డ శ్రీధర్ కి చంద్రబాబు తగిన పదవి ఇవ్వాల్సింది కానీ ఇవ్వలేదు. పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా సరిపెట్టారు.
అలాగే మరో సీనియర్ నేత ఆలపాటి రాజా..ఆయన తెనాలి, వేమూరు నియోజకవర్గాల నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేశారు.తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వేమూరు నియోజకవర్గం నుండి తొలిసారిగా, 1999లో రెండోసారి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అయితే ఆయన ఆ తరువాత 2004లో జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలయ్యాడు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 22 అక్టోబర్ 1999 నుండి 26 నవంబర్ 2001 దాకా చంద్రబాబు మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పని చేశాడు. ఆ తరువాత జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గం నుండి 2009, 2014, 2019లో పోటీ చేసి 2014లో ఎమ్మెల్యేగా గెలిచాడు. అలాంటి ఈ నేతకి కూడా తగిన పదవి ఇవ్వలేదని అనుచరులు అసంతృప్తి చెందుతున్నారు. మరి భవిష్యత్తులో వీళ్లకు తగిన పదవులు ఇచ్చి చంద్రబాబు న్యాయం చేస్తారో లేదో చూడాలి.