వైసీపీ కష్టాలు : మెగా డిఎస్సీనే జగన్ కొంప ముంచిందా..?

murali krishna
* బలమైన వైసీపీ సామ్రాజ్యాన్ని కూలదోసిన నిరుద్యోగ సమస్య
* మెగా డీఎస్సీ అంశమే వైసీపీకి శాపంగా మారిందా?
* నిరుద్యోగులను పట్టించుకోకపోవడమే వైసీపీ ఘోర ఓటమికి కారణమా..?
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు ముగిసాయి.. ఈ ఎన్నికలలో కూటమి ఏకంగా 164 సీట్లు సాధించి తిరుగులేని విజయం సాధించింది. వైసీపీ పార్టీ కేవలం 11 సీట్లు మాత్రమే సాధించి ప్రతిపక్ష హోదా కోల్పోయింది. కూటమిలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ 21 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంట్ స్థానాలు పొందగా అన్నింట్లో విజయం సాధించి 100 శాతం స్ట్రైక్ రేటు పొందారు. కూటమి గెలుపులో జనసేన పార్టీ కీలక పాత్ర పోషించింది.. గతంలో రెండు చోట్ల ఓడిపోయినా పవన్ కల్యాణ్ ఇప్పుడు తనతో 20 మంది ఎమ్మెల్యే లను గెలిపించుకొని ఏకంగా రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా పదవి భాద్యతలు చేపట్టి రియల్ స్టార్ గా నిలిచారు. అయితే రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి దారుణంగా మారింది. ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో రాష్ట్రప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కోలేని పరిస్థితి ఏర్పడింది. అయితే వైసీపీ ఇంత దారుణంగా ఓడటానికి కారణం రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యను పట్టించుకోకపోవడం.

రాష్ట్రంలో డిఈడి, బీఈడి పూర్తి చేసిన అభ్యర్థులు 6 లక్షలకు పైగా వుంటారు. వీరంతా డిఎస్సీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గతంలో అధికారంలోకి రాకముందు జగన్ మోహన్ రెడ్డి 23వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని కచ్చితంగా చెప్పారు. కానీ ఆ హామీ నిలబెట్టుకోలేక పోయారు. ఎంతసేపు నాడు నేడు కింద స్కూల్ రూపురేఖలు మార్చాము, ఇంగ్లీష్ మీడియం తెచ్చాం, బై లింగ్యూవల్ పుస్తకాలు ప్రవేశపెట్టాం అని వైసీపీ భారీగా ప్రచారం చేసుకున్నారు. కానీ అవన్నీ వున్నా భోదించేందుకు ఉపాధ్యాయుడు లేకుంటే అవి వుండి వ్యర్థమే.. జగన్ అన్న వచ్చాడు డిఎస్సీ ఇస్తాడు అని కోటి ఆశలు పెట్టుకున్న ఉపాధ్యాయ నిరుద్యోగులు ఎంతగానో ఎదురు చూసారు. చివరికి ఎలక్షన్ సమయానికి 6100 పోస్టులతో డిఎస్సీ ప్రకటించారు. అందులో కూడా చాలా జిల్లాలో జీరో పోస్టులు చూపించగా విద్యార్థుల ధర్నాలతో కొన్ని పోస్టులను ప్రతి జిల్లాకు 100 చొప్పున అడ్జస్ట్ చేసారు. అలాగే 2 ఏళ్ల అప్రంటీస్ విధానం తెచ్చారు. దీనితో నిరుద్యోగుల గుండె రగిలిపోయింది. డిఎస్సీ పరీక్ష జరగకుండా ఎలక్షన్ కమిషన్ కు లేఖలు రాయడంతో పరీక్షలు ఆగిపోయాయి. ఇన్నేళ్ల కోపం ఈ ఎలక్షన్స్ తో నిరుద్యోగ యువత తీర్చుకున్నారు.. నిరుద్యోగులతో పెట్టుకుంటే ఎంతటి బలమైన ప్రభుత్వం కూడా కుదేలు అవుతుందని మరోసారి నిరూపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: