వైసీపీలో బీసీలు Vs రెడ్లు... జ‌గ‌న్ ముందు కొత్త పంచాయితీ..?

RAMAKRISHNA S.S.
అసలే ఘోర ఓటమితో తల పట్టుకుంటున్న వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు ఇప్పుడు కొత్త తలనొప్పి మొదలైంది. వైసీపీలో కొత్త పంచాయితీ ప్రారంభమైంది. నెల్లూరు జిల్లాలో సొంత పార్టీలోనే రెడ్లు వర్సెస్ బిసి గొడవ ప్రారంభమైంది. 2014, 2019 ఎన్నికలలో వైసీపీకి రెండుసార్లు ఏకపక్షంగా విజయం అందించిన జిల్లాలో ఈ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ రెక్కలు విరిగిపోయాయి. ఇందుకు ప్రధాన కారణం ఒక బీసీ నేత అంటూ వైసీపీలోని రెడ్లు అందరూ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికలలో నెల్లూరు జిల్లాలలో వైసీపీ వైట్ వాష్ అయిపోయింది. మొత్తం పది అసెంబ్లీ స్థానాలతో పాటు నెల్లూరు పార్లమెంటు స్థానాన్ని కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది.

ఇందుకు ప్రధాన కారణం ఇప్పుడు వైసీపీలో ఉన్న రెడ్లు అందరూ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కారణం అని ఆరోపణలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అనిల్ కుమార్ కు జగన్ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో లెక్కలేని తనంతో ప్రవర్తించి జిల్లాలో సీనియర్ నేతలను.. మరి ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలను అగౌరవపరిచారని.. బహిరంగ విమర్శలు చేశారని రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్గా చేసుకుని చేసిన వ్యాఖ్యలు కూడా ఆ సామాజిక వర్గంలో తీవ్ర అసంతృప్తి కారణం అయ్యాయి.

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇలా మహామహులు అయిన వైసీపీ నేతలు అందరూ కేవలం అనిల్ కుమార్ తీరు వ‌ల్లే పార్టీకి దూరమయ్యారు. వారంతా తెలుగుదేశం పార్టీలోకి వెళ్లి ఘన విజయం సాధించారు. అసలు జిల్లాలో వైసీపీని ముందు నుంచి కాపాడిన రెడ్డి సామాజిక వర్గాన్ని పక్కన పెట్టిన జగన్.. అనిల్ కుమార్ యాదవ్ కు పద‌వి ఇవ్వడంతో రెడ్లు అందరూ అనిల్ ను టార్గెట్ చేస్తూ వచ్చారు. చివరికి ఈ గొడవలో పార్టీ తీవ్రంగా నష్టపోయింది. మరి ఇప్పుడు జగన్ నెల్లూరు జిల్లాలో రెడ్డి వర్సెస్ బీసీ పంచాయితీని ఎలా సర్దుబాటు చేస్తారో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: