బొత్స కుటుంబంలో కల్లోలం..రాజకీయాలకు దూరం ?

Veldandi Saikiran
వైసీపీ ఓటమి తర్వాత.. బొత్స కుటుంబంలో కల్లోలం నెలకొంది. ఏపీ మాజీ మంత్రి సతీమణి బొత్స ఝాన్సీ విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్నికల ప్రచారంలో విశాఖ తన పుట్టినిల్లు అన్నారు. మీ ఆడపడుచుని ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. మెట్టినింటితో పాటు పుట్టినిల్లు విశాఖ అభివృద్ధి తన లక్ష్యమని చెప్పారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత కనిపించకుండా పోయారట. విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓటమి చూసిన బొత్స ఝాన్సీ ఇప్పుడు పక్క జిల్లాకే పరిమితం అయ్యారట. ఉత్తరాంధ్రాలో బొత్స కుటుంబం ఏళ్లుగా రాజ్యం ఏలుతోంది. సొంత జిల్లా విజయనగరంలో అయితే బొత్స కుటుంబం కుటుంబానిదే ఆధిపత్యం.
ఇక తమ సామ్రాజ్యాన్ని విశాఖకు కూడా విస్తరించాలని భావించిన మాజీ ఎంపీ బొత్స సత్యనారాయణ విశాఖ లోక్ సభ అభ్యర్థిగా బొత్స ఝాన్సీని ఎన్నికల బరిలోకి దించారు. అయితే బొత్స ఝాన్సీని అభ్యర్థిగా ప్రకటించగానే విశాఖలో లోకల్, నాన్ లోకల్ నినాదం తెరమీదకు వచ్చింది. పైగా బొత్స కుటుంబం విశాఖలో పాగా వేస్తే విశాఖ కూడా ఆ కుటుంబం చేతిలోకి వెళ్ళిపోతుందని స్థానిక వైసిపి నేతలు కొంతమంది ఆందోళన చెందారట. బొత్స ఆధిపత్యం ప్రారంభమైతే విశాఖలో స్థానికంగా ఉన్న బలమైన నేతలను ఎదగనివ్వరని కొంతమంది వ్యతిరేకించారట. దీంతో పార్టీ పెద్దలు వైవి సుబ్బారెడ్డితో పాటు లోకల్ నాయకులకు సర్ది చెప్పారు. అయినా బొత్స ఝాన్సీకి అఇష్టంగానే మద్దతు పలికి ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
తాను విశాఖలో ఆడపడుచుని.... విశాఖలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. అంతేకాదు గతంలోనూ బెస్ట్ పార్లమెంటేరియన్ గా అవార్డు తీసుకున్నానని... అలాగే విశాఖను కూడా అన్ని రంగాలుగా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తానని.... ఇకనుంచి విశాఖలోనే తన నివాసం ఏర్పరచుకుంటానని చెప్పారు. గతంలో ఝాన్సీ బొబ్బిలి ఎంపీగా, విజయనగరం ఎంపీగా గెలిచారు. ఈసారి విశాఖలో గెలిస్తే ఉత్తరాంధ్ర అంతా తమదే అనుకొని ఎన్నికల వ్యూహాలు గట్టిగానే రచించారు. అయినా కూడా ఊహించని పరిణామాలే ఎదురయ్యాయి. ఓటమి చూడక తప్పలేదు. ఎందుకంటే గతంలో బొత్స ఝాన్సీ నియోజకవర్గంలో గాని, జిల్లాలో గాని చెప్పుకోదగ్గ పనులేవి చేయలేదని తీవ్ర విమర్శలు ఉన్నాయి. బొత్స కుటుంబం మీద విజయనగరం జిల్లా వాసుల్లో తీవ్ర అసంతృప్తి ఉందని టాక్ కూడా ఉంది.
విజయనగరం జిల్లాలో పోటీ చేస్తే గెలవరని.... విశాఖపట్నం వచ్చి పోటీ చేస్తున్నారని... ఎన్నికలకు ముందు సొంత పార్టీలోనే గుసగుసలు కూడా వినపడ్డాయి. విశాఖ లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగిన ఝాన్సీ టిడిపి అభ్యర్థి శ్రీ భరత్ చేతిలో భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. చిత్రం ఏంటంటే శ్రీ భరత్ కి వచ్చిన మెజార్టీ కంటే తక్కువ ఓట్లు బొత్స ఝాన్సీకి రావడాన్ని వైసిపి నేతలు జీర్ణించుకోలేకపోయారు. ఎన్నికల ముందు వరకు బొత్స సత్యనారాయణ, బొత్స ఝాన్సీ చీటికిమాటికి విశాఖకు వచ్చి సమావేశాలు, ప్రెస్ మీటింగ్ లు పెట్టి తెగ హడావిడి చేసేవారు. కానీ ఓటమి తర్వాత విశాఖ వైపు కన్నెత్తి చూడలేదట. ఇక ఆమె రాజకీయాలకు 5 ఏళ్లు దూరంగా ఉండాలని అనుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: