కాంగ్రెస్‌లోకి మ‌రో 6 గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. లిస్టులో ఉంది వీళ్లే..?

Divya
ఒకే ఒక్క ఓటమి దెబ్బకు తెలంగాణలో ఏకంగా పదేళ్లపాటు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ క‌కావికలు అయిపోతుంది. ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు.. కేసీఆర్ తనయుడు కేటీఆర్ .. కెసిఆర్ మేనల్లుడు మాజీ మంత్రి , బిఆర్ఎస్ పార్టీ ట్రబుల్ షూటర్ గా పేరు ఉన్న తన్నీరు హరీష్ రావు సైతం ఏం చేయలేక చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి. ఈ రోజు ఎవరు ? పార్టీని వీడ‌తారో ఎప్పుడు ? ఎవరు పార్టీకి గుడ్ బై చెబుతారో ? ఎప్పుడు ఎవరిని నమ్మాలో ? తెలియక కేసీఆర్ ఫ్యామిలీ సతమతమవుతోంది. ఈ టెన్షన్లు ఇలా ఉంటే మరోవైపు కేసీఆర్ కుమార్తె కల్వ‌కుంట్ల కవిత మద్యం కేసులో ఢిల్లీ జైల్లో గత మూడు నాలుగు నెలలుగా శిక్ష అనుభవిస్తున్నా ఆమెను కనీసం బెయిల్ పైకి తీసుకువచ్చే ప్రయత్నాలు కూడా విఫలమవుతూ ఉండటం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ కేడర్లో తీవ్ర ఆందోళనకు కారణం అవుతున్నాయి.

ఇప్పుడున్న పరిస్థితులలో పార్టీకి భవిష్యత్తు ఉంటుందన్న నమ్మకం లేక చాలామంది పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలతో పాటు ఆరుగురు ఎమ్మెల్సీలు కారు దిగి హస్తం గూటికి చేరిపోయారు. రేవంత్ రెడ్డి ఒక్కసారి ఆపరేషన్ ఆకర్ష్‌ ప్రారంభించి హస్తం పార్టీలోకి అలా గేట్లు ఎత్తారో లేదో వెంటనే వరుస పెట్టి ఎంపీ , ఎమ్మెల్యేలు .. ఎమ్మెల్సీల తో పాటు జిల్లాస్థాయిలో కీలక నేతలు అందరూ కాంగ్రెస్ గూటికి చేరిపోతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వలసలకు ఇప్పట్లో బ్రేకులు పడేలా కనిపించడం లేదు. తాజాగా మరో ఆరుగురు శాసనసభ్యులు హస్తం తీర్థం పుచ్చుకోవటానికి రెడీ అవుతున్నట్టు తెలంగాణ రాజకీయ వర్గాలలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన రాజేందర్ నగర్ ఎమ్మెల్యే తోలుకుంట్ల ప్రకాష్ గౌడ్ శుక్రవారం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. అలాగే ఒకటి రెండు రోజులలో శేరిలింగంపల్లి నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన ఆరికెపూడి గాంధీ - ఉప్పల్‌ నుంచి గెలిచిన బండారు లక్ష్మారెడ్డి - ఎల్బీనగర్ నుంచి గెలిచిన సుధీర్ రెడ్డి - కూకట్‌ప‌ల్లి నుంచి వరుసగా మూడుసార్లు గెలుస్తూ వస్తున్న మాధవరం కృష్ణారావు .. అలాగే కుత్బుల్లాపూర్ నుంచి వరుసగా మూడోసారి గెలిచిన కూన వివేకానంద గౌడ్ వీరంతా కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇలా వరుస పెట్టి ఎమ్మెల్యేలు పార్టీ వీడుతూ ఉండటం చూస్తుంటే బిఆర్ఎస్ వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో అధికారం రేసు లో ఉంటుందా లేదా మూడో స్థానానికి పడిపోతుందా ? అన్న సందేహాలు అయితే సొంత పార్టీ నేతలు కేడర్ కే కలుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: