అత్యంత బిజీబిజీగా వైసీపీ నేతలు.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Suma Kallamadi
ఏపీలో వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీ నేతలు ప్రస్తుతం ఏం చేస్తున్నారో తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం వైసీపీ నేతలు బిజీబిజీగా గడుపుతున్నారు. క్షణం తీరిక లేకుండా కనిపిస్తున్నారు. ఎన్నికలు లేని ప్రస్తుత తరుణంలో ఇలాంటి హడావుడి ఎందుకనుకుంటున్నారా? అధికారం లేకపోయినా బిజీగా ఉండటమేంటని భావిస్తున్నారా? అదే కేసుల భయం. చిన్న స్థాయి నాయకుడి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడి వరకు అంతా ప్రస్తుతం పోలీసుల అరెస్టుల నుంచి బయట పడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ, ముందస్తు బెయిల్ కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికే హైకోర్టును పలువురు పెద్ద స్థాయి నాయకులు ఆశ్రయించారు. వివిధ కేసుల్లో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానాలను అర్ధిస్తున్నారు.
వైసీపీ హయాంలో 2021లో కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇంటి వైపు మాజీ మంత్రి జోగి రమేష్ అనుచరులతో దూసుకెళ్లారు. ఈ క్రమంలో తీవ్ర అలజడి సృష్టించారు. అప్పట్లో ఆయన సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ దూకుడు తత్వమే కొన్నాళ్లకే ఆయనకు మంత్రి పదవి దక్కేలా చేసింది. మరో వైపు ఏకంగా మంగళగిరిలో డీజీపీ ఆఫీసుకు కూతవేటు దూరంలో ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నాయకులు గతంలో దాడి చేశారు. ఈ ఘటనలో దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి సహా పలువురు నాయకులపై ఆరోపణలున్నాయి. వీరందరికీ ప్రస్తుతం అరెస్ట్ ముప్పు ఉంది. దీంతో పోలీసులు తమను అరెస్ట్ చేయకుండా ఆయా నాయకులంతా ముందస్తు బెయిల్ పొందేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పాత ఘటనల తాలూకా కేసులను తిరగదోడుతున్నారు.

దీంతో తమకు ముప్పు ఎప్పుడు ఏ వైపు నుంచి వస్తుందోనని వైసీపీ నేతల్లో భయం పట్టుకుంది. ఈ క్రమంలో ప్రస్తుతం బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన వారిలో వైసీపీ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులను ఆయన తన గుప్పెట్లో పెట్టుకున్నారని, వారిని బెదిరించి పనులు చేయించుకున్నారని సజ్జలపై ఆరోపణలున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన నంబర్ 2గా కొనసాగారు. పార్టీతో పాటు ప్రభుత్వంలో అన్ని పనులనూ కనుసైగతో చక్కబెట్టేవారు. దీంతో ప్రభుత్వం మారాక ఆయనకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. ఈవీఎం ధ్వంసం కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్ లభించినా, సీఐ, టీడీపీ కార్యకర్తపై హత్యాయత్నం కేసులో ఆయన ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఆయన సైతం వివిధ కేసుల్లో బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: