తెలంగాణ బాధ్యత నారా బ్రాహ్మణి చేతిలో?

Suma Kallamadi
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవలి తెలంగాణ పర్యటనలో భాగంగా మాట్లాడుతూ... తెలంగాణలో మరలా తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తెస్తామని, పార్టీ బలోపేతం చేస్తామని చెప్పిన తరువాత తెలంగాణలో ఉన్న తెలుగుదేశం తమ్ముళ్లలో నూతన ఉత్సాహం వచ్చిందనే చెప్పుకోవాలి. ఇక ఈ నేపథ్యంలోనే మరో అనుమానం అందరికీ వస్తోంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఎవరికి అప్పచెబుతారు? అనేది. అవును, తెలంగాణ పార్టీ పగ్గాలు ఎవరి చేతిలో పెట్టబోతున్నారనే విషయం ఇపుడు సర్వత్రా ఉత్కంఠగా మారింది.
గతంలో తెలంగాణ టీడీపీ అధ్యక్షులుగా ఉన్న ఎల్.రమణ బీఆర్ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్సీగా ఎన్నికైన సంగతి అందరికీ తెలిసినదే. మరో మాజీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు అయితే పార్టీలోనే ఉన్నప్పటికీ తెలంగాణాలో ప్రస్తుతం తెలుగుదేశం ఉనికి లేకపోవడంతో సైలెంట్ గా ఉన్నాడు. మరొక మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కూడా గత ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరి ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉండడంతో ఇక్కడి పార్టీ శ్రేణులు, అభిమానులు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పని చేయడం జరిగింది. ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వీరిలో కొత్త ఆశలు చిగురించాయనే చెప్పుకోవచ్చు.
అయితే ఇప్పుడు బాబు, లోకేష్ ఇద్దరూ ఏపీ రాజకీయాల్లో తనమునకలై ఉండడంతో తెలంగాణలో తెలుగుదేశం పగ్గాలు నారా బ్రాహ్మణి చేతిలో పెడితే బావుంటుందని పార్టీ నేతలు, కార్యకర్తలు ఫీల్ అవుతున్నారని గుసగుసలు వినబడుతున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ అధిష్ఠానం బాలక్రిష్ణ కూతురు నారా బ్రాహ్మణికి ఆ బాధ్యతలు అప్పగించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. బ్రాహ్మణి గురించి అందరికీ తెలిసినదే. ఆమె ఓ అగ్ర సినీ నటుడికి కూతురు మాత్రమే కాదు, ఓ రాజకీయ నేతకు కోడలు కూడా. కాగా ఇప్పటికే కుటుంబంలో అంతర్గతంగా జరిగిన చర్చలో లోకేష్, బాలక్రిష్ణలు బ్రాహ్మణికి పగ్గాలు అప్పగించేందుకు సూచనప్రాయంగా అంగీకరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: