జనసేనలోకి వైసీపీ టాప్ లీడర్... ముందే ఫిక్సింగ్ ..?
వైసీపీకి చెందిన పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ఇటీవల ఎన్నికలలో గుంటూరు నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేతిలో ఘోరంగా చిత్తుచిత్తుగా ఓడిపోయిన కిలారు వెంకట రోశయ్య పార్టీకి రాజీనామా చేశారు. గుంటూరులో తన అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన రోశయ్య వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ కొందరు వ్యక్తులు చేతుల్లో నడుస్తోందని.. పార్టీలో కష్టపడిన వారికి ఎంత మాత్రం గుర్తింపు ఉండటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మారెడ్డి అనుభవాన్ని పార్టీ వాడుకోలేదని.. మండలిలో ప్రతిపక్ష నేత విషయంలోనూ కనీసం చర్చించలేదని అన్నారు.
ప్రతిపక్ష నేతగా కూడా ఉమ్మారెడ్డికి అవకాశం ఇవ్వలేదు.. గుంటూరు నుంచి ఎంపీ అభ్యర్థిగా నన్ను నిలబెట్టారు.. కొందరు మానసికంగా ఇబ్బంది పెట్టేలా వ్యవహరించారు.. ఎన్నికల తర్వాత కూడా వారి ఇష్టంతోనే పార్టీని నడుపుతున్నారు... వైసీపీలో కొనసాగలేను అని రోశయ్య స్పష్టం చేశారు. ఇక ఇదే బాటలో మరికొందరు వైసిపి నేతలు కూడా ఉండే అవకాశం ఉన్నట్టు గుంటూరు జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఇక వైసీపీకి గుడ్ బై చెప్పిన రోశయ్య ఇప్పుడు జనసేనలో చేరతారని అంటున్నారు. వాస్తవానికి ఆయన జనసేన మనిషే అంటారు. గతంలో ప్రజారాజ్యంలో చేరి తెనాలి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన ఇప్పటికే జనసేన టచ్లో ఉన్నారని.. ఎన్నికలకు ముందు నుంచే ఆయన జనసేన లోని తన సామాజిక వర్గ నేతలతో కలిసిపోయారని.. ఇప్పుడు పార్టీ ఓడిపోగానే ఆయన అటు కండువా మార్చేస్తున్నారని.. ఇదో ఫిక్సింగ్ వ్యవహారంలా ఉందని టాక్ ?