ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ పెట్టిన బడ్జెట్ పైన అందరూ చర్చించుకుంటున్నారు. ఏ రాష్ట్రానికి ఎంత నిధులు వచ్చాయి..? ఏ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని అన్ని రాష్ట్రాలు సమావేశాలు కూడా నిర్వహించుకుంటున్నాయి. అయితే మొన్నటి బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పవచ్చు. అదే సమయంలో... చంద్రబాబు అధికారంలో ఉన్న ఏపీలో.. భారీగా నిధులు వచ్చాయి.
భారీగా నిధులు కేటాయిస్తూ నిర్మల సీతారామన్ ప్రకటించారు. అదే సమయంలో తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపించారు. ఎక్కడ కూడా తెలంగాణ అనే పదం లేకుండా.. బడ్జెట్ను ముగించేసారు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్. అయితే ఏపీకి ఇచ్చి తెలంగాణకు ఇవ్వకపోవడం ఏంటని.. గులాబీ పార్టీ అలాగే కాంగ్రెస్ మండిపడుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది మంది బిజెపి ఎంపీలు ఉన్న.. తెలంగాణకు నష్టమే జరిగిందని మండిపడుతున్నారు. దీనిపై నిన్న అసెంబ్లీలో చర్చ కూడా జరిగింది. ఓ మోషన్ కూడా మూవ్ చేశారు. ఈ సందర్భంగా గులాబీ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీల మధ్య వార్ కొనసాగింది. అయితే... గులాబీ పార్టీ మొన్న లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచి ఉంటే... తెలంగాణ రాష్ట్రానికి కొన్ని అయినా నిధులు తీసుకువచ్చే వాళ్ళమని కేటీఆర్ అన్నారు.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లి దీక్షలు చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్ అలాగే హరీష్ రావు. అయితే దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి... తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన కేసీఆర్.. ఇప్పుడు ఢిల్లీలో చేయాలని కోరారు. కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఢిల్లీకి వచ్చి దీక్ష చేస్తే తాను కూడా వెళ్తానని ప్రకటించారు. దీనిపై గులాబీ పార్టీ నేతలు చర్చించి తనకు చెప్పాలన్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో దీక్షల రాజకీయం మొదలైంది. మరి దీనిపై బీజేపీ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.