జగన్.. ఏపీని అంతగా భ్రష్టు పట్టించారా.. నిజమేనా?
గతంలో వైసీపీ ప్రభుత్వం తమ హయాంలో టీడీపీ, జనసేన కార్యకర్తలను అణిచి వేసేందుకు పోలీసు శాఖను దుర్వినియోగం చేసిందని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జగన్ ఏమో మూడు సింహాలకు అర్థం తెలుసా అంటూ.. ప్రజా స్వామ్యాన్ని కాపాడాలని క్లాస్ పీకుతున్నారు. ఈ నేపథ్యంలో శాసన సభలో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు హొం మంత్రి వంగలపూడి అనిత. ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో పోలీస్ శాఖను పలు అంతర్గత లోపాలు వెంటాడాయని చెబుతూ.. గతంలో మహేంద్ర కంపెనీ ఏపీ పోలీస్ శాఖను బ్లాక్ లిస్ట్ లో పెట్టారని.. కోర్టులో కేసు సైతం వేశారని చెప్పడం గమనార్హం.
అవును… గత వైసీపీ ప్రభుత్వం ఏపీ పోలీస్ శాఖ కోసం మహేంద్ర కంపెనీ నుంచి వాహనాలను కొనుగోలు చేసింది. అయితే వాటికి సంబంధించి 2021 సమయంలో సుమారు రూ.17 కోట్లు పెట్టి పోలీస్ శాఖకు వాహనాలు కొన్నారని చెప్పిన అనిత.. వాటికి సంబంధించిన బిల్లులు మాత్రం చెల్లించలేదని వెల్లడించారు.
దీంతో మహేంద్ర కంపెనీ ఏపీ పోలీస్ శాఖను బ్లాక్ లిస్ట్ లో పెట్టిందని వివరించారు. అంతే కాకుండా ఈ విషయంపై న్యాయ స్థానాన్ని సైతం ఆశ్రయించారని తెలిపారు. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల రూ.13 కోట్లు తమ కూటమి ప్రభుత్వం విడుదల చేసిందని వెల్లడించారు. దీంతో ఈ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.