ఎస్సీ వర్గీకరణతో మారనున్న ఏపీ రాజకీయాలు.. జగన్‌కు లాభమా?
తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ అంశం కాక రేపనుంది. ఏపీలో మాలలు అధిక సంఖ్యలో, తెలంగాణలో మాదిగలు అధిక సంఖ్యలో ఉన్నారు. రిజర్వ్‌డ్ సీట్లు 29తో పాటు ఎన్నో నియోజకవర్గాల్లో మాలలు గెలుపోటములను శాసించే స్థితిలో ఉన్నారు. ఇప్పుడు వారంతా విద్య, ఉద్యోగాలలో తమకు నష్టం జరుగుతుందనే భావనలో ఉన్నారు. ఇక ఎస్సీ రిజర్వేషన్ కోసం 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటాన్ని మందకృష్ణ మాదిగ చేశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంతీర్పు రాగానే ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఎస్సీ వర్గీకరణ జరగడానికి మోడీ, కిషన్ రెడ్డితో పాటు చంద్రబాబు ఎంతో కృషి చేశారని క్రెడిట్ ఇచ్చారు. దీంతో స్వతహాగా మాదిగల్లో మెజార్టీ శాతం చంద్రబాబుకే మద్దతుగా నిలవనున్నారు. అయితే ఇటీవల ఎన్నికల్లో మాలలు మాత్రమే కాకుండా అన్ని కులాల మద్దతు కూటమి ప్రభుత్వానికి లభించింది. ఏపీలో తొలి నుంచి మాలలు అధికంగా కాంగ్రెస్ పార్టీకి ఆ తర్వాత వైసీపీకి మద్దతుగా నిలుస్తూ వచ్చారు. ప్రస్తుతం మారిన తాజాగా పరిస్థితుల నేపథ్యంలో మాలలు జగన్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని చర్చ సాగుతోంది. మరో వైపు చంద్రబాబు తాను ఎస్సీల్లో అన్ని కులాలను సమానంగా చూస్తానని చెబుతున్నారు. దీంతో మాలలు ఎటువైపు మొగ్గు చూపుతారోనని సర్వత్రా ఆసక్తికర చర్చ నడుస్తోంది.