పొలిటికల్ జేయింట్ కిల్లర్స్: రాజకీయ ఓనమాలు నేర్పిన గురువునే ఓడించిన ఘనుడు కేసీఆర్..!
- రాజకీయం నేర్పిన గురువుపైనే కేసీఆర్ విజయం..
- తెలంగాణ రాష్ట్రానికి రెండుసార్లు సీఎంగా చరిత్ర..
కల్వకుంట్ల చంద్రశేఖర రావు అలియాస్ కేసీఆర్. ఈయన పేరు చెప్తే దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంటుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు. చివరికి రాష్ట్రాన్ని సిద్ధింపజేసి రెండుసార్లు వరుసగా సీఎం అయ్యారు. అలాంటి కెసిఆర్ తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయిన తర్వాత ఎన్నో అద్భుతమైన పథకాలు తీసుకువచ్చి పేద ప్రజల దేవుడయ్యారు. ఆయన తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికే తలమానికం అని చెప్పవచ్చు. రైతుబంధు,రైతు బీమా ఇలా రైతుల కోసం ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా ఎన్నో అద్భుత పథకాలు తీసుకొచ్చిన ఘనుడు. రాజకీయాల్లో కేసీఆర్ వేసినటువంటి వ్యూహాలు ఎవరు వేయలేరని చెప్పవచ్చు. అలా రెండు సార్లు తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన మెజారిటీ సాధించి ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఇక మూడవ సారి కూడా తానే గెలుస్తాననుకున్నాడు.కానీ కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా అధికారంలోకి వచ్చింది. అలాంటి కేసీఆర్ రాజకీయం ఎప్పుడు మొదలైంది.. రాజకీయ గురువును ఎప్పుడు ఓడించారు.. అనే వివరాలు చూద్దాం.
గురువును ఓడించిన ఘనుడు:
విద్యార్థి దశ నుంచే కేసీఆర్ రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు.ముందుగా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘం నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కేసీఆర్ 70వ దశకంలో యువజన కాంగ్రెస్ నాయకుడిగా పని చేశారు. 1977 లోక్సభ ఎన్నికల్లో ఇందిరా గాంధీ ఓటమి తర్వాత కాంగ్రెస్ పక్షాన నిలిచాడు. అలా తన రాజకీయ గురువు అయినటువంటి మదన్మోహన్ పై 1983లో స్వతంత్ర అభ్యర్థిగా సిద్దిపేట నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పొందాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ పార్టీ స్థాపన జరిగింది. దీంతో కేసీఆర్ తెలుగుదేశం పార్టీలో చేరి మళ్లీ సిద్దిపేట నుంచి 1985లో పోటీ చేసి మొదటిసారి శాసనసభకు ఎన్నికయ్యాడు.