బాబోయ్.. ఈ బ్యాంకుల బాదుడు మామూలుగా లేదుగా?
తాజాగా వచ్చిన గణాంకాలు పరిశీలిస్తే.. మన మైండ్ బ్లాంక్ అవ్వక మానదు. 2019 నుంచి 2024 వరకు మినిమం బ్యాలెన్స్ చేయడం లేదనే ఖాతాదారుల నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకులు జరిమానాల రూపంలో రూ.8500 కోట్లు వసూలు చేశాయి. ఇందులో గతేడాదిలోనే రూ.2331 కోట్లను బ్యాంకులు వసూలు చేశాయి. కాగా ఎస్బీఐ మినిమం బ్యాలెన్స్ ఛార్జీలను 2020 నుంచి పక్కన పెట్టింది. మిగతా బ్యాంకులు మాత్రం ఈ ఛార్జీల బాదుడును ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాయి.
గతంలో పోలిస్తే ఈ ఐదేళ్లలో వసూలు 34 శాతానికి పైగా పెరగడం గమనార్హం. ప్రస్తుతం దేశంలో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండగా.. అందులో మినిమం బ్యాలెన్స్ లేదని ఫైలన్లు వసూలు చేస్తున్న బ్యాంకుల్లో పీఎన్ బీ, బీవోబీ, ఇండియన్ బ్యాంకు, కెనరా, బీవోఐ టాప్ -5 లో ఉన్నాయి. ఎస్బీఐ 2019-20లో గరిష్ఠంగా రూ.640 కోట్లు వసూలు చేసింది.
ఇక ప్రైవేట్ రంగ బ్యాంకుల విషయానికొస్తే రూ.25 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్ల వరకు వసూలు చేశాయి. అయితే దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మన దేశంలో కార్పొరేట్ సంస్థలు రూ.లక్షల కోట్లలో రుణాలు తీసుకొని ఎగవేసి దర్జాగా తిరుగుతున్నా.. మన బ్యాంకులు మాత్రం వారిని ఏమీ చేయలేకపోతున్నాయి. కానీ సామాన్యుల దగ్గర మాత్రం ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి. ఓ వైపు దేశ ప్రజలందరికీ ముఖ్యంగా పేదలకు బ్యాంకింగ్ సేవలను దగ్గర చేస్తానన్న మోదీ ఈ జరిమానాలపై నోరు మెదపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.