ధర్మాన ప్రసాదరావు ఎన్ని పార్టీలు మారినా.. మంత్రే అయ్యారే..!
* పార్టీలు మారిన ఎప్పుడూ మంత్రే అయిన నేతలు
* వారిలో ధర్మాన ప్రసాదరావు ఒకరు
* కాంగ్రెసు వైసీపీలో మంత్రిగా సేవలు
(ఏపీ - ఇండియా హెరాల్డ్)
శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ రాజకీయ నాయకుడు ధర్మాన ప్రసాద రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన 45 ఏళ్లకు పైగా రాజకీయాల్లో కొనసాగారు. 2019 ఎన్నికలతో సహా ఐదుసార్లు శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈసారి కూడా అదే టికెట్ నుంచి పోటీ చేశారు కానీ 50,000 కంటే ఎక్కువ ఓట్ల తో టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ధర్మాన ప్రసాదరావు ప్రభుత్వంలో అనేక కీలక పాత్రలు చేపట్టారు.
ధర్మాన కాంగ్రెస్ లో ఉన్నప్పుడు నేదురుమల్లి జనార్దనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గంలో జౌళి, క్రీడలు, జలవనరుల శాఖల మంత్రిగా పనిచేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా ఉన్నారు. ధర్మాన ప్రసాద రావు గ్రామ కౌన్సిలర్ (సర్పంచ్)గా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించాడు. ధర్మాన 1981లో మబగాం గ్రామ సర్పంచ్‌గా పని చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా అంచెలంచెలుగా ఎదుగుతూ మంత్రి పదవి చేపట్టారు.
2012, ఆగస్టులో, VANPIC ప్రాజెక్ట్‌లో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఆయనపై ఒక్కసారిగా వెల్లువెత్తాయి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అతనిపై ఛార్జిషీట్ దాఖలు కూడా చేసింది. ఈ పరిస్థితులలో ధర్మాన ప్రసాద రావు తన క్యాబినెట్ పదవికి రాజీనామా చేశారు. కొన్ని రోజుల తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి 2014 ఫిబ్రవరి 9న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన గుండ లక్ష్మీదేవిపై విజయం సాధించారు.
ప్రస్తుతం 66 ఏళ్లు వయసున్న ధర్మాన నరసన్నపేట మండలం, మబగాం గ్రామంలో సావిత్రమ్మ, రామలింగంనాయుడు దంపతులకు జన్మించారు. వచ్చేసారి ఆయన ఎన్నికల్లో పోటీ చేయవచ్చు, చేయకపోవచ్చు. కానీ ఆయన ఇప్పటిదాకా అద్భుతమైన రాజకీయ ప్రయాణాన్ని సాగించారు.