ఈ మధ్యకాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతున్న పేరు.. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్. సింపుల్‌గా చెప్పాలంటే హైడ్రా. అక్రమార్కుల గుండెల్లో రైళ్లను పరుగెత్తిస్తోంది వ్యవస్థ. చెరువులు, కుంటలను కబ్జా చేసి కట్టిన భారీ బిల్డింగులు, అపార్ట్‌మెంట్లను సైతం నేలమట్టం చేస్తోంది.హైదరాబాద్, సికింద్రాబాద్‌లల్లో ఆక్రమణకు గురైన చెరువులను పరిరక్షించడం, వాటిల్లో వెలిసిన అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి ప్రత్యేకంగా హైడ్రా వ్యవస్థను తెరమీదికి తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అదనంగా మూడువేల మంది సిబ్బందినీ దీనికి కేటాయించింది.మీరాలం, బమ్ రుక్ ఉద్ దౌలా వంటి చెరువులు, వాటి ఎఫ్‌టీఎల్ పరిధి, బఫర్ జోన్ అధిగమించి నిర్మించిన పలు భవనాలు, అపార్ట్‌మెంట్లను ఇప్పటికే కూల్చివేశారు అధికారులు. ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్- కన్వెన్షన్ సెంటర్ పాక్షిక కూల్చివేతతో హైడ్రా పేరు ఒక్కసారిగా వెలుగులోకివచ్చింది.మాదాపూర్‌తమ్మిడికుంట చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించినట్లు నిర్ధారణ కావడంతో హైడ్రా, జీహెచ్‌ఎంసీ, టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు ఆక్రమణలను తొలగించారు. దీనిపై నాగార్జున కోర్టును ఆశ్రయించడంతో ఊరట లభించింది. కూల్చివేతలకు స్టే లభించింది.ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి మల్లారెడ్డిలో భయం మొదలయిందట. హైడ్రా కూల్చివేతలతో మల్లారెడ్డి తనను లక్ష్యంగా చేసుకుని బుల్‌డోజర్లు వస్తాయని ఆయన ముందుగానే అంచనా వేసుకుంటున్నారు.
న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. తమకు చెందిన నిర్మాణాలకు జోలికి రాకుండా ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై చర్చలు జరుపుతున్నారని తెలిసింది. ఎందుకంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ నెక్ట్స్ టార్గెట్ తానేనని ఆయనకు తెలుసు. అందుకే ముందస్తు చర్యలకు మల్లారెడ్డి కుటుంబ సభ్యులు దిగినట్లు చెబుతున్నారు. వీలుంటే సోమవారం న్యాయస్థానాన్ని ఆశ్రయించే ఆలోచనలో ఉన్నారని తెలిసింది.మల్లారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలతో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తొడలు గొట్టారు. వ్యక్తిగత దూషణలకు దిగారు. ఛాలెంజ్ లు విసిరారు. దమ్ముంటే తేల్చుకుందాం అంటూ మంత్రిగా ఉన్న సమయంలో విసిరిన సవాళ్లు ఇప్పుడు మల్లారెడ్డి మెడకు చుట్టుకునేలా ఉన్నాయి. ఎందుకంటే మల్లారెడ్డి సుద్దపూస ఏం కాదు. ఆయన నిర్మాణాలన్నీ ఆక్రమణలే. ప్రభుత్వం మారిన వెంటనే ఆయనపై ఎన్నో ఫిర్యాదులు అందాయి. తమ భూములను ఆక్రమించుకున్నారని కొందరు, తక్కువ ధరకు తమ వద్ద నుంచి భూమిని కొనుగోలు చేసి తమను ఛీటింగ్ చేశారంటూ ఇలా అనేక రకాలుగా ఫిర్యాదులు పోలీస్ స్టేషన్ లో పెండింగ్ లో ఉన్నాయి.
ప్రధానంగా మల్లారెడ్డి చెరువులు, నాలాలను ఆక్రమించి ఆసుపత్రితో పాటు కళాశాలలు, యూనివర్సిటీలను నిర్మించారని కూడా తాజాగా ఫిర్యాదు అందింది. మల్లారెడ్డి కళాశాలలను నిర్మించిన స్థలాలపై ఎన్నో రకాల వివాదాలున్నాయి. అయితే ఇన్నాళ్లూ ఆయన అధికారంలో ఉండటంతో దాని నుంచి సులువుగా బయటపడగలిగారు. పైగా మంత్రి పదవిలో ఉండటంతో ఆయనకు తిరుగులేకుండా పోయింది. అయితే ఒక్కసారిగా తెలంగాణలో పరిస్థితులు మారాయి. ఆయన ఓటమి పాలయిన బీఆర్ఎస్ లోనే ఉన్నారు. మల్లారెడ్డి తిట్టిపోసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. ఇది ఒక్క కారణం చాలదూ.. బుల్ డోజర్ బయలుదేరడానికి అంటూ పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది.
మల్లారెడ్డి గత కొద్ది రోజుల నుంచి మౌనంగానే ఉంటున్నారు. హైడ్రా కూల్చివేతలు నగరంలో మొదలు పెట్టడంతో కొంత అలజడితో ఉన్నట్లు తెలిసింది. అయితే విద్యాసంస్థలు, ఆసుపత్రులు కాబట్టి వాటి జోలికి రారులే అన్న ధీమాలో ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో మల్లారెడ్డి కళాశాలలోని కొన్ని అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఇప్పుడు పక్కా ఆధారాలతో హైడ్రా కు ఫిిర్యాదులు అందడంతో మల్లారెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. హైడ్రా ప్రధానంగా చెరువులు, నాలాలు ఆక్రమించిన వాటిని కూల్చివేస్తుండటంతో తమ వంతు వస్తుందని గట్టిగా భావిస్తున్నారు. అందుకే ముందస్తు చర్యలకు దిగనున్నట్లు తెలిసింది.