బెయిల్ వచ్చినా కవిత బయటకు వచ్చేది అప్పుడేనా ..?

Chakravarthi Kalyan

ఈడీ అయితే ఏం అవుతుంది చూసుకుంటాం. సిస్టం ప్రకారం వెళ్తాం. ఈడీకే మా నాన్న అంటే భయం ఇలా చాలానే మాటలు చెప్పిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. దిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టు కావడం.. తిహాడ్ జైల్లో నెలల తరబడి ఉండటం బెయిల్ కోసం ఆమె జరిపిన పోరు అంతా ఇంతా కాదు.


ఆమె ఏదో ఒక సాకు చెప్పి బెయిల్ కోరడం.. దానిని కోర్టు తిరస్కరించడం ఇప్పటి వరకు జరిగాయి. కానీ నేడు ఆమెకు సుప్రీం కోర్టులో భారీ ఊరట దక్కింది. ఆమె బెయిల్ మీద విచారణ జరిపిన జస్టిస్ బీఆర్ గవాయ్.. జస్టిస్ విశ్వ నాథన్ లతో కూడిన ధర్మాసనం ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కవిత తరఫున వాదనలు ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ,  ఈడీ తరఫున ఏఎస్పీ వాదనలు వినిపించారు.


మార్చి 15న కవితను అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి 153 రోజులుగా ఆమె జైలులోనే ఉన్నారు.  అయితే ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. దీనికి మూడు ప్రధాన కారణాలను ధర్మాసనం వెల్లడించింది. సీబీఐ తుది ఛార్జిషీట్ దాఖలు చేసిందని.. ఈడీ కూడా దర్యాప్తు పూర్తి చేసిందని పేర్కొంది. నిందితురాలు జైలులో ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది. మహిళగా కూడా పరిగణించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అందుకే బెయిల్ ఇస్తున్నట్లు వెల్లడించింది.



ఇదే సందర్భంలో పలు షరతులను విధించింది. సుప్రీం కోర్టుకి రూ.10 లక్షల విలువైన రెండు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. కేసు గురించి మీడియా ముందు ప్రస్తావించకూడదని.. సాక్షులను ప్రభావితం చేయకూడదని స్పష్టంగా పేర్కొంది. అలాగే సంబంధిత అధికారులకు కవిత పాస్ పోర్టు ను అప్పగించాలని సూచించింది. ఇక సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆమె తిహాడ్ జైలు నుంచి సాయంత్రంలోపు విడుదల కానున్నారు. ధర్మాసనం తీర్పు పత్రాలను ఆమె తరఫు లాయర్లు వెంటనే జైలు అధికారులకు అందించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: