తెలుగు రాష్ట్రాల్లో వరదల విలయతాండవం..వరద సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే..!!
* తెలుగు రాష్ట్రాలను ముంచెత్తిన ఆకస్మిక వరదలు
* ముమ్మరంగా సాగుతున్న సహాయక చర్యలు
* వరదల సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే..?
రెండు తెలుగు రాష్ట్రాలలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి..వరదల తాకిడికి ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ నగరం నీట మునిగింది..గడిచిన నాలుగు రోజుల నుంచి ఎడతెరప లేకుండా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి..ఈ భారీ వర్ష తాకిడికి నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.విజయవాడ ప్రజలు కృష్ణా నది ఉగ్రరూపం చూసి భయపడిపోతున్నారు..ఇదివరకు ఎప్పుడూ లేనంతగా వరద నీటితో కృష్ణానది జోరుగా ప్రవహిస్తుంది.చాలా ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి..అయితే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు గతంలో కూడా వచ్చాయి.. గతంలో ఇంతకంటే దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయి.. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం భారీగా జరిగింది. సమాచార వ్యవస్థ పూర్తిగా ధ్వంసం అయింది.. భారీగా కొండచరియలు విరిగిపడటంతో ముఖ్యమైన రహదారులన్ని చెల్లాచెదురై పోయాయి.. ఈ నేపథ్యంలో వరదల సమయంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కొన్ని కీలక సూచనలు చేసింది.
వరద కొనసాగుతున్న సమయంలో :
* వరద నీటిలోకి అస్సలు వెళ్ళకూడదు.
* వరద నీరు ప్రవహిస్తున్న మురుగు నీటి కాలువలకు, కల్వర్టులకు దూరంగా ఉండాలి..
* విద్యుత్ స్తంభాలకు, విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలి.
* తెరిచి ఉంచిన డ్రైనేజీ లేదా మ్యాన్‌హూల్స్ ను గుర్తించి ఎవరు కూడా అటు వైపు వెళ్లకుండా బారికేడ్లు ఉంచాలి..
* వరద నీటిలో నడవడం, కారు డ్రైవ్ చేయడం ప్రమాదకరం. రెండు అడుగుల కంటే ఎక్కువ లోతులో ప్రవహించే వరద నీరు పెద్ద కార్లను సైతం తీసుకోనిపోగలవు.
* అప్పుడే వండిన లేదా పొడి ఆహారాన్ని తినాలి .
* తినే ఆహారపదార్దాలపై ఎలాంటి డస్ట్ పడకుండా ప్లేట్ లేదా కవర్ తో మూసి ఉంచాలి .
* కాచి చల్లార్చిన లేదా క్లోరినేటెడ్ నీరు మాత్రమే త్రాగాలి.
* అంటువ్యాధులు సోకకుండా చుట్టూ వున్న పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి క్రిమిసంహారక మందులను వాడాలి..
వరద ఉధృతి తగ్గినా తరువాత:
* వరద నీటి సమీపంలో ఆడుకోడానికి చిన్నపిల్లలను బయటకు పంపకూడదు.
* విద్యుత్ అధికారులు సూచించిన వెంటనే కరెంట్ కు సంబందించిన ప్రధాన స్విచ్లులను ఆపివేయాలి.. తడిగా ఉంటే విద్యుత్ పరికరాలను తాకవద్దు.
* వరదల సమయంలో పాము కాటు సాధారణం. పాముల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. పాముకాటుకు ప్రధమ చికిత్స తెలుసుకోవాలి
* మలేరియా వంటి వ్యాధులు రాకుండా దోమ తెరలను వాడాలి..
* మీరు త్రాగే నీరు సురక్షితం అని ఆరోగ్య శాఖ సలహా ఇచ్చే వరకు పంపు నీరు తాగకూడదు..
* అలాగే వరద నీటిలో ఆహారం తినడం వంటివి చేయకూడదు