వైఎస్ ను మించిపోయిన రేవంత్...మహిళల కోసం ఉచిత బస్సులు ?
* ఆధార్ కార్డు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం
* ఒక్కో కుటుంబానికి రూ.6 వేలు ఆదా
* 6 గ్యారెంటీల్లో భాగంగా మహాలక్ష్మి స్కీం..
తెలంగాణ రాష్ట్రంలో... మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 6 గ్యారంటీలను అమలు చేసే పనిలో పడింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాస్త ఆలస్యం అయినప్పటికీ.. ఒక్కో హామీని నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం.
అయితే రేవంత్ రెడ్డి తీసుకువచ్చిన పథకాలలో మహాలక్ష్మి పథకం.. చాలా కీలకమైనది. ఇది కేవలం మహిళల కోసం ప్రత్యేకంగా తీసుకురావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం ఫ్రీ బస్సు స్కీము తీసుకువచ్చారు. తెలంగాణ రాష్ట్ర మహిళల చేతిలో ఒక ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది.. ఎక్కడ కూడా టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు.
పల్లె వెలుగు నుంచి ఎక్స్ప్రెస్ వరకు అన్ని బస్సుల్లో... ఆధార్ కార్డు చూపించి తెలంగాణ నలుమూలల మహిళలు ప్రయాణించవచ్చు. డీలక్స్ అలాగే లగ్జరీ బస్సులు మినహా అన్ని బస్సుల్లో ఈ సౌకర్యాన్ని తీసుకువచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి దాదాపు 6వేల రూపాయలు సంవత్సరానికి ఆదా అవుతుంది. ఫ్రీ బస్సు ఏర్పాటు చేసినప్పటి నుంచి మహిళలే అన్ని రంగాల్లో దూసుకు వెళ్తున్నారు.
ఇంట్లో ప్రతి అవసరానికి ఉచిత బస్సులు వాడుకొని సద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే చాలాసార్లు ఈ ఫ్రీ బస్సు పైన ప్రతిపక్షాలు అనేక రకాల విమర్శలు చేశాయి. కేటీఆర్ కూడా ఈ విషయంలో ఒక క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఏదేమైనా తెలంగాణ మహిళలు మాత్రం ఈ ఫ్రీ బస్సు పట్ల సంతృప్తి గానే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీటితోపాటు మిగతా గ్యారంటీలను కూడా అమలు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతున్నారు మహిళలు.