వైసీపీ ఎమ్మెల్యే జంప్... ఫస్ట్ వికెట్ పడిపోతోంది.. ?
- ( ఉత్తరాంధ్ర - ఇండియా హెరాల్డ్ ) .
వైసీపీ మొన్న జరిగిన సాధారణ ఎన్నికలలో గెలిచింది కేవలం 11 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ పార్టీలో తొలి వికెట్ పడబోతుంది అన్న ప్రచారం వైసీపీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. వైసీపీకి ఓ ఎమ్మెల్యే గుడ్ బై చెప్పబోతున్నారని తెలుస్తోంది. ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు ఉమ్మడి విశాఖ జిల్లా పాడేరు వైసీపీ ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు. ఆయన తొలిసారి అసెంబ్లీకి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తాజాగా ఆయన పాడేరు నియోజకవర్గ వైసీపీ నేతలు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
ఈ క్రమంలో తనను కూటమీ వైపు తీసుకువెళ్లాలని ప్రయత్నాలు వచ్చాయి అన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. విశ్వేశ్వర రాజు వైసీపీలోనే పుట్టానని.. తన రాజకీయ జీవితం ఆ పార్టీతో అని పేరుకు చెబుతున్న.. ఆయన వైసీపీలో ఉంటే ఐదేళ్లపాటు ఎలాంటి ఉపయోగం లేదని.. తనకు రాజకీయంగా ఎలాంటి భవిష్యత్తు ఉండదని.. అదే పార్టీ మారితే అధికార పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగడంతో పాటు.. తనను నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని ఐదేళ్ల పాటు పాడేరు నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందన్న నిర్ణయానికి వచ్చేసినట్టు తెలుస్తోంది.
గతంలో పార్టీ మారిన చాలామంది ఎమ్మెల్యేలు కూడా.. పార్టీ మారే ముందు తాము అసలు పార్టీ మారం అని ప్రమాణాలు చేసేవారు. అలా చెప్పిన వారం పది రోజులకే పార్టీ కండువాలు మార్చేసేవారు. ఈ క్రమంలోనే విశ్వేశ్వర రాజు కూడా పార్టీ మార్పు అంశంపై నియోజకవర్గంలో తనకు అత్యంత సన్నిహితులైన వారితో ఇప్పటికే చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక వైసీపీ నుంచి పడే తొలి వికెట్ ఆయనదే అన్న చర్చ కూడా నడుస్తోంది. ఇక ఏజెన్సీలో వైసీపీ అరకు, పాడేరు ఎమ్మెల్యే సీట్లతో పాటు అరకు ఎంపీ సీటును సైతం గెలుచుకున్న సంగతి తెలిసిందే.