గతయిదేళ్లలో స్టీల్‌ప్లాంట్ కోసం మీరేం పీకారు: గంటా

Suma Kallamadi
"స్టీల్ ప్లాంట్ పరిరక్షణే మా ధ్యేయం.. దానికోసం ఏం చేయాలన్న మేమే చేయాలి. మీ వల్లకాదు.. చేతకాని మాటలు ఎందుకు ఆడుతారు జగన్ రెడ్డి!" అంటూ మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మంగళవారం ప్రధాని మోదీ జన్మదినం పురస్కరించుకుని సాగర్ నగర్ బీచ్‌లో స్వచ్చ శుభ్రతను ఎమ్మెల్యే నిర్వహించగా ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ఒక రేంజులో వైసీపీ వ్యవహారంపై దుమ్మెత్తిపోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘నా రాజీనామాపై మీవి చవకబారు విమర్శలు’’ అంటూ వైసీపీపై మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ...  వైసీపీ గత 5 సంవత్సరాలు అధికారంలో ఉండి స్టీల్ ప్లాంట్ కోసం ఏం పీకారని ఎద్దేవా చేసారు. గడిచిన 5 సంవత్సరాలు గాడిదలు కాశారా? అంటూ విరుచుకుపడ్డారు. ఢిల్లీ వెళ్లిన ప్రతీ సారీ జగన్ రెడ్డి మోడీ, అమిత్ షా కాళ్లపై పడి, తనపై ఉన్న కేసులు ఎత్తేయమని చెప్పడం తప్ప, రాష్ట్రానికేం చెప్పారని ప్రశ్నించారు. తాము వచ్చిన మూడు నెలలోనే మాంగనీస్ గనులు కేటాయించామని తెలిపారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదన ఆగినా, ప్రైవేటీకరణ జరగబోదని స్టీల్ మంత్రి కుమారస్వామి విశాఖలో ప్రకటించినా అది టీడీపీ వల్లే సాధ్యపడిందని ఈ సందర్భంగా గుర్తు చేసారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ... స్టీల్ ప్లాంట్ ఒక పరిశ్రమ కాదని.. తెలుగు ప్రజల ఆత్మ గౌరవం, గుండె చప్పుడని స్పష్టం చేస్తూ... స్టీల్ ప్లాంట్ కోసం ఎమ్మెల్యేగా తాను చేసిన రాజీనామాపై 3 సంవత్సరాల పాటు తాత్సారం చేసి ఎటూ తేల్చకుండా ఎమ్మెల్సీ ఎన్నికల సమయానికి ఆమోదించి వైసీపీ రాజకీయం చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేసారు. వైజాగులో జగన్ కళ్ళు ఎప్పుడు కూడా ఋషి కొండపై తప్పితే ఇంకెక్కక్కడా ఉండేవి కాదని మండిపడ్డారు. వైజాగుని రాజధానిని చేస్తా అని చెప్పి వైజాగ్ కొండలన్నీ కబ్జా చేసారని మండిపడ్డారు. రానున్న ఐదేళ్లలో ఆ చిట్టాలు విప్పి, అందరి అంతు తేలుస్తామని ఈ సందర్భంగా వార్నింగ్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: