రఘురామ మూగ నోము.. ఏం జరిగింది...?
గంటల తరబడి ఆయన మీడియాలోనే ఉన్న రోజులు కూడా ఉన్నాయి. అలాంటి రఘురామ ఇప్పుడు మాత్రం మీడియా ముందుకు రావడమే మానేశారు. గత రెండు మాసాలుగా అయితే.. ఆయన పట్టుమని నాలుగు సార్లు మీడియాతో మాట్లాడి ఉంటారు. అలాగని ఆయన విదేశాల్లో ఏమీ లేరు. తన సొంత నియో జకవర్గం ఉండిలోను, అడపాదడపా... హైదరాబాద్‌లోనూ ఉంటున్నారు. స్థానికంగా తాను చేయాల్సిన పనులు తాను చేసుకుంటూ పోతున్నారు.
ఇంతకు మించి.. గతంలో మాదిరిగా సమకాలీన అంశాలపైనా.. వైసీపీ రాజకీయాలపైనా ఆయన నోరు ఎత్తడం లేదు. ముఖ్యంగా కూటమి సర్కారు పగ్గాలు చేపట్టి బుధవారానికి 100 రోజులు పూర్తయ్యాయి. దీనిని పురస్కరించుకుని కూడా ఆయన ఎక్కడా మాట్లాడలేదు. మరి దీనిని ఎలా చూడాలి? ఎందుకు ఇలా చేస్తున్నారు? అనేది ఆసక్తిగా మారింది. రఘురామ వర్గంలో జరుగుతున్న చర్చ ప్రకారం.. ఆయన అసంతృప్తిలో ఉన్నారని తెలుస్తోంది.
తనకు స్పీకర్ పదవిని కానీ, మంత్రి పదవిని కానీ ఇస్తామని హామీ ఇచ్చినట్టు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చర్చ జరిగింది. ఈ విషయాన్ని ఆయన కూడా ప్రస్తావించారు. కానీ, కూటమిసర్కారులో ఆయన కేవలం ఎమ్మెల్యేగామాత్రమే మిగిలిపోయారు. ఇది ఒక రీజన్ అయితే.. మరో కీలక రీజన్ ఏంటంటే.. తెలంగాణలో ఉన్నప్పుడు(అప్పట్లో రఘురామ ఎంపీ) ఆయనపైనా.. ఆయన కుమారుడిపైనా అక్కడి పోలీసులు కేసులు పెట్టారు. ఈవిషయంలో తెలంగాణ సర్కారు ఇచ్చే నివేదిక కీలకంగా మారింది.
దీనిపై చంద్రబాబుతో రఘురామ చర్చించారని.. తెలంగాణ సర్కారు తనకు అనుకూలంగా నివేదిక ఇచ్చేలా సహకరించారని ఆయన కోరినట్టు తెలిసింది. అయితే.. ఈ విషయంలో చంద్రబాబు పెద్దగా స్పందించలేదని సమాచారం. ఈ కారణంతోనే ప్రధానంగా రఘురామ మౌనం వహిస్తున్నారనేది ఆయన అనుచరులు చెబుతున్నమాట. ఏదేమైనా.. రఘురామ ఇప్పుడు సెంటరాఫ్ టాక్‌గా మారారు.