శ్రీవారీ లడ్డూ తయారీలో అపశృతి.. తప్పెవరిది..?

Divya
•స్వామివారి లడ్డూ తయారీలో అపశృతి..
•స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులు గొడ్డు మాంసం..
•లడ్డూ నాణ్యత కాపాడడమే ప్రభుత్వ ధ్యేయం - సీఎం
కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అనగానే అందరికీ గుర్తొచ్చేది లడ్డూ. స్వామివారిని ఎంత భక్తిశ్రద్ధలతో అయితే పూజిస్తామో.. స్వామి వారి ప్రసాదాన్ని కూడా అంతే పవిత్రంగా భావిస్తారు. కుల, మత, వర్ణ , జాతి,  వర్గ బేధాలు లేకుండా..ప్రతి ఒక్కరి కోర్కెలు తీర్చుతూ కొంగుబంగారంగా మారిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తూ.. తాము స్వామివారిని దర్శించుకున్నాము అని చెబుతూ స్వామి వారి ప్రసాదంగా తీసుకొచ్చిన లడ్డూలను ప్రతి ఒక్కరికి నైవేద్యంగా పంచుతూ ఉంటారు. ఇక లడ్డు తిన్న వారు కూడా స్వామివారిని దర్శించుకున్నంత హద్దుగా భావిస్తారు. అలాంటి ఇంతటి పవిత్రమైన లడ్డు తయారీలో తాజాగా అపశృతి చోటు చేసుకుందని, దానికి కారణం గత ప్రభుత్వ నిర్లక్ష్యమే అంటూ ప్రస్తుత ప్రభుత్వం నిందిస్తోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

నిజానికి శ్రీవారి లడ్డూ రుచితో పాటు అద్భుతమైన వాసన రావడానికి కారణం ప్రత్యేకమైన పద్ధతులను అవలంబించడమే. స్వామి వారి లడ్డూ ను తయారు చేయడానికి ప్రత్యేకంగా స్వచ్ఛమైన ఆవు నెయ్యి,  పటిక బెల్లం, ఎండు ద్రాక్ష, స్వచ్ఛమైన కర్పూరం , శెనగపిండి, జీడిపప్పు, యాలకులు ఉపయోగిస్తారు. వీటిలో ఎటువంటి కల్తీ లేకుండా ప్రత్యేకంగా వంటశాలను ఏర్పాటు చేసి మరీ అక్కడ స్వామివారి లడ్డును తయారు చేస్తారు. అయితే ఈ మధ్యకాలంలో లడ్డూలలో నాణ్యత ఉండడం లేదు అంటూ భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నెయ్యిలో నాణ్యత తగ్గడం వల్లే లడ్డు యొక్క వాసన, రుచి కోల్పోతుందని తిరుమల వాసులు చెబుతున్న మాట. ఇక టీటీడీ తెచ్చే ముడి సరుకుల నాణ్యతను పరిశీలనకు పంపిస్తూ ఉంటారు.
 
అయితే ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చాక నెయ్యి శాంపిల్స్ తీసుకొని 2 ల్యాబ్ లకు పంపగా,  అందులో జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయని తెలిపారు. దీంతో భక్తులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ తమ  మనోభావాలతో ఆడుకోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు లడ్డు తయారీలో వాడిన నెయ్యిని గొడ్డు మాంసం కొవ్వుతో తయారు చేశారంటూ సీఎం చంద్రబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో జరిగిన మోసాన్ని కూడా ఆయన వివరించారు. అయితే దీనిని మాజీ చైర్మన్లు భూమన,  వైవి సుబ్బారెడ్డి ఖండించారు. తాము కుటుంబంతో సహా శ్రీవారి పాదాల వద్ద ప్రమాణం చేస్తామని ప్రకటించగా,  ఇది రాజకీయం అంటూ భూమన మళ్లీ పాత పాటే పాడారు. తిరుమలను రాజకీయం కోసం వాడుకోవడం ఒక ఎత్తు అయితే నెయ్యిలో కల్తీ చేస్తూ ఇంతకు దిగజారుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది కూటమి ప్రభుత్వం.

ముఖ్యంగా నెయ్యిలో ఉన్నవి జంతువుల కొవ్వుతో తయారైన పదార్థాలని,  ఫిష్ ఆయిల్ తో పాటు మైదా సహా ఇంకా ఏం పదార్థాలు ఉన్నాయో ల్యాబ్ ఇచ్చిన రిపోర్టును బయటపెట్టింది. ఈ దేశంలోనే నెంబర్ వన్ డైరీ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టు అని, గుజరాత్ కు శాంపిల్స్ పంపగా వచ్చిన రిపోర్ట్ ఇదిగో అంటూ టిడిపి నేత ఆనం వెంకటరమణారెడ్డి కూడా మీడియాకు చదివి వినిపించారు. ఇకపోతే స్వామివారి లడ్డుకి పూర్వ రుచిని వాసనను తీసుకురావడానికి లడ్డు యొక్క నాణ్యతను కాపాడేందుకు గతంలో నెయ్యి సరఫరా చేసే కర్ణాటక ప్రభుత్వ రంగా డైరీ , నందిని డైరీల  నుండి తిరిగి కొనుగోలు ప్రారంభించామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. అయితే తప్పు ఎక్కడ జరుగుతోంది..?  ఎవరు చేస్తున్నారు..?  అనే విషయాలు పక్కన పెడితే.. లడ్డు యొక్క నాణ్యతను పెంచే ప్రయత్నం చేయాలని భక్తులు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: