వైసీపీ ఇటీవలి ఎన్నికలలో ఘోర పరాజయాన్ని అందుకోవడాన్ని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికీ నమ్మడం లేదు. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే వైసీపీలోని కొందరు మినహా మెజారిటీ నేతలు వాస్తవాన్ని అంగీకరించారు. అతి కొద్ది మంది మాత్రం తెలుగుదేశం కూటమి విజయానికి ఈవీఎంల టాంపరింగే కారణమని ఆరోపణలు గుప్పిస్తున్నారు. జూన్ 4, 2024న ప్రకటించిన ఫలితాలు, జగన్ ఐదేళ్ల పాలనకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన విస్పష్ట తీర్పు అనడంలో సందేహం లేదని పరిశీలకులు అంటున్నారు. ఇంతటి ఘోర ఓటమిని కలలో కూడా ఊహించని వైసీపీ క్యాడర్, నేతలు ఇంకా దిగ్భ్రాంతి నుంచి తేరుకోనే లేదు. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ వారికి వాస్తవం అవగతమవ్వడం మొదలైంది. జగన్ తీరు, వ్యవహారశైలి పార్టీ ఓటమికి కారణమన్న నిర్థారణకు వచ్చేసిన పలువురు నేతలు పార్టీని వీడుతున్నారు.ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం జగన్ కు వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే నేతల రాజీనామాలతో ఇక్కట్లు పడుతున్న జగన్ కు మరో నేత వైసీపీకి రాజీనామా చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆయన టీడీపీ ముఖ్యనేతలతో మంతనాలు జరుపుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జోరందుకుంది.
ఎన్నికలు అయ్యాక పార్టీ కార్యకలాపాలకు దూరంగా శ్రీనివాస్ దూరంగా ఉంటున్నారు. అన్ని సెట్ అయితే టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమని ఆయన అనుచరుల్లో మాట వినిపిస్తోంది. ఇటీవల జిల్లాలోని నియోజకవర్గ ఇంఛార్జ్ లతో సిఎం జగన్ సమావేశం అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ డుమ్మా కొట్టారు. 2019 లో సినీ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై గెలిచిన తనకు సరైన పదవి ఇవ్వకపోవడంతో అప్పట్లోనే వైసీపీ అధిష్టానంపై శ్రీనివాస్ అలిగారు. పార్టీ మారుతున్నట్లు తెలుసుకున్న అధిష్టాన నేతలు శ్రీనివాస్ ను బుజ్జగించే పనులు పడ్డారు. ఈ నేపథ్యంలోనే రాజ్యసభ సభ్యులు మోపిదేవి, బీదా మస్తాన రావు సైతం ఇప్పటికే పార్టీ వీడారు. తాజా జాబితాలో తూర్పు గోదావరికి చెందిన సీనియర్ నేత తోట త్రిమూర్తులు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన్ను జనసేనలోకి తీసుకెళ్లేందుకు సామినేని ఉదయభాను ప్రయత్నాలు చేస్తున్నారు. అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి పేరు లిస్టులో ఉంది. ఇక..పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు కూడా పార్టీ వీడుతున్నారని వైసీపీలో జోరుగా ప్రచారం సాగుతోంది.దీంతో,దసరా వేళ మరి కొందర ముఖ్యులు పార్టీ వీడుతారనే ప్రచారం సాగుతోంది.కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.