మాజీ మంత్రి, మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి ముందు జనసైనికులు ధర్నాకు దిగారు. తిరుపతి లడ్డూ కల్తీ వివాదంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పేర్ని నాని చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళన చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే జనసైనికులకు ధీటుగా పేర్ని తనయుడు కిట్టు కూడా వైసీపీ కార్యకర్తలతో నిరసనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు పోలీసులు పరిస్థితులను అంచనా వేసి ముందుగానే అక్కడికి చేరుకున్నారు. పేర్ని నాని ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు గొడవలు, ఘర్షణలు జరుగకుండా ఉండేలా చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.నిన్న తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో కొడాలి నాని, వల్లభనేని వంశీలతో కలిసి మీడియాతో మాట్లాడిన పేర్ని నాని చంద్రబాబు, నారా లోకేష్ లు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ స్వలాభం కోసం దేవుడి లడ్డూ కల్తీ అయిందని చెప్పి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫమవ్వగా దాని గురించి ప్రజలు నిలదీస్తారన్న భయంతో తెరపైకి ఇలాంటివి తీసుకొచ్చి డ్రామాలాడుతున్నారని దుయ్యబట్టారు.
దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారు కాబట్టే పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారని విమర్శించారు. ఆ మధ్యెప్పుడో భీమవరంలో బాప్తీశం తీసుకున్నానని చెప్పారని, రంజాన్ మాసంలో హలాల్ చేసిన మాంసాన్ని తిననని చెప్పారని, అవన్నీ జనాలు మరిచిపోరన్నారు. రష్యా చర్చిలో ఏసుప్రభు ముందు మోకాళ్ల దండ వేశారని, అందరికీ గుర్తుందన్నారు. అయితే, పవన్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించమని జనసైనికులు నినదించారు. తన ఇంటి ముట్టడికి జనసైనికులు రావటం పైన పేర్ని నాని సీరియస్ అయ్యారు. తమ ఇంటికి వాళ్ల ఇల్లు ఎంత దూరమూ..వాళ్ల ఇంటికి తమ ఇల్లు అంతే దూరమని గుర్తించాలని సూచించారు. సినిమా షూటింగ్స్ తరహాలో రాజకీయాల్లో చేయాలంటే సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. కులం, మతం లేదని పార్టీ స్థాపించిన పవన్ ఇప్పుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్ని నాని మండిపడ్డారు. ఇతర మతాలను ప్రస్తావిస్తూ హిందువుల బయటకు రారా అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడుతూ నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.ఇదే విధంగా రాజకీయం చేస్తే తాము సిద్దమని పేర్ని నాని స్పష్టం చేసారు. ఇలాంటి బెదిరింపులకు వైసీపీ కేడర్, తాము భయపడేది లేదన్నారు. పోలీసులు ఇలాంటివి చూస్తూ కూర్చొంటే మచిలీపట్నంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతాయని పేర్ని నాని హెచ్చరించారు.