తిరుపతిలోనే అత్యధికంగా మద్యం షాపులు..! ఇదేం పవిత్రత బాబు గారు?

Chakravarthi Kalyan

ఏపీలో ప్రభుత్వ మద్యం దుకాణాలు రద్దు అయ్యాయి. అక్టోబరు 1 నుంచి నూతన మద్యం పాలసీ అమ్లోకి రానుంది. ప్రైవేట్ మద్యం దుకాణాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెండర్ల ప్రక్రియ ద్వారా షాపులను కేటాయించాలని డిసైడ్ అయింది. నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు చేస్తోంది.


 రాష్ట్ర వ్యాప్తంగా 3736 షాపులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో 340 షాపులను కల్లు గీత కార్మికులకు కేటాయించింది. మిగిలిన 3396 షాపులను లాటరీ పద్ధతి ద్వారా నిర్ణయించనున్నారు. అయితే అత్యధికంగా తిరుపతి జిల్లాకు 264 షాపులను కేటాయించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. ప్రస్తుతం తిరుపతి లడ్డూ వివాదం నెలకొన్న వేళ కొత్త ప్రచారం ప్రారంభం అయింది. తిరుమల పవిత్రతను కాపాడేందుకు తాము లడ్డూ తయారీపై దృష్టి పెట్టామని నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపినట్లు తేలిందని సీఎం చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే.



గత పది రోజులుగా ఈ వివాదం నడుస్తూనే ఉంది. రాజకీయ అంశంగా మారిపోయింది. అధికార విపక్షం మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలో మద్యం షాపులను కేటాయిస్తూ ప్రభుత్వం ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఈ మద్యం షాపుల అంశాన్ని వైసీపీ రాజకీయ అస్త్రంగా మలుచుకొంది. తిరుపతి పవిత్రతను కాపాడాలనుకుంటున్న చంద్రబాబు అదే తిరుపతికి మద్యం షాపులను అధికంగా కేటాయించడం పై సోషల్ మీడియా వేదికగా వ్యంగ్య ప్రచారం ప్రారంభించింది.


ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసింది. మద్యం ధరలను అమాంతం పెంచేసింది. దేశంలో ఎక్కడా చూడని వివిధ బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ప్రజారోగ్యానికి భంగం వాటిల్లింది. తాజాగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలను రద్దు చేశారు. దీంతో మందు బాబులు ఖుషీ అవుతున్నారు. అయితే అత్యధికంగా మద్యం షాపులను తిరుపతి జిల్లాకు కేటాయించడం పై మాత్రం వైసీపీ నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. మరి దీనిపై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: