లడ్డూ వివాదం: ఏరికోరి పరువు పోగొట్టుకున్న కూటమి ప్రభుత్వం.!
•లడ్డు వివాదం పై తప్పుడు ఆరోపణలు
* సుప్రీం కోర్టు ప్రశ్నల వర్షం..
ప్రపంచవ్యాప్తంగా ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అయింది అంటూ ఆంధ్ర ప్రదేశ్ కూటమి ప్రభుత్వం సంచలన కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా స్వామి వారి లడ్డూ తయారీ విధానంలో ఉపయోగించే స్వచ్ఛమైన ఆవు నెయ్యి కి బదులు గొడ్డు మాంసం కలిపారని , పందికొవ్వు ఉపయోగించారు అంటూ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో పెద్ద ఎత్తున జాతీయస్థాయిలో విమర్శలు వెళ్ళ వెత్తుతున్నాయి. గత ప్రభుత్వం పై చాలా మంది ఆరోపణలు కూడా చేస్తున్నారు. అయితే ఇందులో నిజా నిజాలు తెలియాల్సి ఉండగా.. నిన్న సుప్రీంకోర్టులో ఈ వివాదం కాస్త ఒక కొలిక్కి వచ్చింది.
గత ప్రభుత్వాన్ని తప్పుపడుతూ ఎలాగైనా సరే ప్రజలలో మంచి గుర్తింపు సొంతం చేసుకోవాలని ఆలోచించిన కూటమి ప్రభుత్వానికి, నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చెంప దెబ్బ అన్నట్టుగా చెప్పవచ్చు .ఏరి కోరి స్వామి వారి లడ్డు ప్రసాదంలో తల దూర్చి పరువు పోగొట్టుకున్నారని స్పష్టం అవుతుంది. తాజాగా చంద్రబాబు తెరపైకి తీసుకొచ్చిన ఈ తీరుపై దాఖలైన పిటిషన్ లపై నిన్న సుప్రీంకోర్టులో జస్టిస్ బి. ఆర్. గవాయ్, జస్టిస్ విశ్వనాథంతో కూడిన ధర్మాసనం తాజాగా విచారణ జరిగింది. ఈ సందర్భంగా సీఎం హోదాలో చంద్రబాబు లడ్డు వివాదాన్ని తెరపైకి తెచ్చిన విధానంపై పిటిషనర్లు సుప్రీంకోర్టులో అభ్యంతరం తెలుపగా.. దీనిపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. తిరుమల లడ్డు వ్యవహారంలో చంద్రబాబు చేసిన ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, బిజెపి మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టులో వేరువేరు పిటిషన్లు దాఖలు చేయగా.. వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు రాజకీయాల నుంచి దేవుడిని దూరంగా ఉంచాలని తెలిపింది. ఈ సందర్భంగా రాజకీయాలకు , మతానికి మధ్య ఉండాల్సిన దూరాన్ని కూడా సుప్రీంకోర్టు గుర్తు చేస్తూ తీర్పు ఇచ్చింది.
ఇకపోతే లడ్డు తయారీలో వాడిన నెయ్యిలో చేపనూనె, పందికొవ్వు, జంతువుల కొవ్వు ఉన్నట్లు గుజరాత్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టును సీఎం చంద్రబాబు విడుదల చేసిన సమయాన్ని కూడా సుప్రీంకోర్టు తప్పు పడుతూ ఫైర్ అయ్యింది. దీనిపై చంద్రబాబు మీడియాను ఆశ్రయించాల్సిన అవసరం ఏమి వచ్చింది ? అంటూ మండిపడింది. కల్తీ నెయ్యి జరిగినట్లు సాక్ష్యం చూపించాలని కూడా ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఇతర సప్లయర్ల నుంచి శాంపుల్స్ ఎందుకు తీసుకోలేదు అని కూడా ప్రశ్నించింది. నెయ్యి శాంపిల్స్ పరీక్షలపై రెండవ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు అని కూడా ప్రశ్నించింది. ఇలా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ సుప్రీంకోర్టు చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా వైసీపీ ప్రభుత్వం పై తప్పుడు ఆరోపణలు చేయాలనుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఏరికోరి పరువు పోగొట్టుకుంటుందని చెప్పవచ్చు.