ఇప్పటివరకు అనేక రాష్ట్రాలలో మేము అధికారంలోకి రాగానే రాష్ట్రంలో మద్యం షాపులు అనేవి లేకుండా చేస్తాము అని హామీలు ఇచ్చిన ప్రభుత్వాలు అనేకం ఉన్నాయి. కానీ తీరా అధికారంలోకి వచ్చాక వాటిని కొనసాగించిన ప్రభుత్వాలే ఎక్కువ ఉన్నాయి. ఇలా ప్రభుత్వాలు ఎందుకు మద్యం షాపులను నడపడానికి అత్యంత ఆసక్తిని చూపుతాయి అంటే మద్యం ద్వారా రాష్ట్రానికి ఎక్కువ మొత్తంలో పన్నులు వస్తాయి. అలాగే మద్యం ధరలను ఎంత పెంచినా కూడా ప్రజలు ఎందుకు పెంచారు అని డిమాండును వ్యక్తం చేయరు.
దానితో ఇష్టం వచ్చినట్లు ధరలు పెంచుకునే వెసులుబాటు కూడా మద్యంపై ఉంటుంది. మద్యం టెండర్లపై కూడా జనాలు అత్యంత ఆసక్తిని చూపిస్తుంటారు. ఒక్క సారి మద్యం షాప్ టెండర్ తాకినట్లయితే లైఫ్ సెటిల్ అయిపోతుంది అనే భావనలో ఉండే వ్యక్తులు కూడా చాలా మంది ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు మద్యం షాప్ లైసెన్సు పొందాలి అంటే విధానం ఒకరకంగా ఉండేది. ప్రస్తుతం మరో రకంగా ఉంది. ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో వైన్ షాప్ లైసెన్స్ పొందాలి అంటే టెండర్లు వేసే సిస్టం ఉండేది. అందులో ఒక వైన్ షాప్ కు ఎవరు ఎక్కువ ధరతో టెండర్ చేస్తే వారికే ఆ మద్యం షాప్ లైసెన్స్ దక్కేది. దానితో ఎక్కువ మొత్తంలో డబ్బులు ఉన్నవారు మాత్రమే వైన్ షాప్ లైసెన్స్ కోసం ప్రయత్నాలు చేసేవారు. చిన్న స్థాయి వారు వాటిని పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వైన్ షాప్ లైసెన్స్ పొందే విధానం మారిపోయింది. అందులో 2 లక్షల రూపాయలు ఉంటే ఎవరైనా వైన్ షాప్ టెండర్ వేయవచ్చు. అందులో లక్కీ లాటరీ ద్వారా ఒకరిని ఎంచుకుంటారు. వచ్చిన వారికి వైన్ షాప్ లైసెన్స్ ఇచ్చేస్తారు.
ఇలా రెండు లక్షలకే వైన్ షాప్ లైసెన్స్ దొరుకుతుంది అని చాలా మంది చిన్న , మధ్య తరగతి వాళ్ళు అక్కడ ఇక్కడ డబ్బులు పోగుచేసి వైన్ షాప్ లైసెన్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక అలాంటి వారికి వస్తే ఓకే కానీ రాకపోతే వారు అనవసరంగా అప్పుల్లో కురుకుపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలా తక్కువ ధరకే వైన్ షాప్ లైసెన్స్ దొరికే అవకాశం ఉన్నందున చాలా మంది సంతోషపడి డబ్బును కూడబెట్టి టెండర్లు వేసి డబ్బులు పోగొట్టుకొని కష్టాలు పడుతున్న వారు కూడా ఉన్నారు.