తిరుమల శ్రీవారి లడ్డు వివాదం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షురాలు, పార్లమెంటు సభ్యులు పురందరేశ్వరి మెడకు చుట్టుకుంది. తిరుమల శ్రీవారి లడ్డు పైన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో... పురందరేశ్వరి మాత్రం...చంద్రబాబు ప్రభుత్వాన్ని పొగుడుతూ మాట్లాడారు. అంటే సుప్రీంకోర్టు వ్యాఖ్యలను.. ధిక్కరిస్తూ వ్యవహరించారు దగ్గుబాటి పురందరేశ్వరి. దీంతో దగ్గుబాటి పురందరేశ్వరుని టార్గెట్ చేశారు వైసీపీ నేతలు. అడుగడుగునా ఆమెను ఉద్దేశించి విమర్శలు చేస్తున్నారు.
ఏపీ మాజీ మంత్రి రోజా అయితే ఒక అడుగు ముందుకు వేసి... పురందరేశ్వరుని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షురాలుగా చేశారు. సిఎం చంద్రబాబు నాయుడు ఏమైనా మాట్లాడవచ్చన్న పురందేశ్వరి వ్యాఖ్యలు సిగ్గుచేటు అంటూ నిప్పులు చెరిగారు మాజీ మంత్రి రోజా. బావ కళ్లలో ఆనందం కోసం కాకుండా భక్తుల కళ్లల్లో ఆనందం కోసం పని చేయాలని చురకలు అంటించారు. తిరుమల లడ్డూకు పరీక్షలు చేయలేదని సుప్రీం కోర్టులో కూటమి లాయరే అంగీకరించారన్నారు మాజీ మంత్రి రోజా. చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో మాట్లాడే మాటలు కోర్టులో ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు.
మీరు బిజెపి అధ్యక్షురాలా లేదా టిడిపి అధ్యక్షురాలా అంటూ నిప్పులు చెరిగారు మాజీ మంత్రి రోజా. ఇదేం సినిమా షూటింగ్ కాదంటూ చురకలు అంటించారు. రోజుకో వేషం, పూటకొక మాట మాట్లాడుతూ ప్రజల మనోభావాలను దెబ్బతీసే అధికారం మీకు లేదన్నారు. సుప్రీం వ్యాఖ్యలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహించారు.
లడ్డూలో కల్తీ నెయ్యి ఘటనపై విచారణ చేపట్టకుండానే సీఎం విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు మాజీ మంత్రి రోజా. తప్పు చేశారు కాబట్టే.. పవన్ తో దేవుడు ప్రాయశ్చిత్త దీక్ష చేయించాడన్నారు. భిన్నమైన ప్రకటనలు చేసిన టీటీడీ ఈవోను కూడా విచారించాలని కోరారు. అధికారంలో ఉండి ఆధారాలు లేకుండా జగన్, వైసీపీ లేకుండా చేయాలని ఇలాంటి కుట్రలు చేశారని ఆగ్రహించారు.