ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం.. మోదీ టెన్షన్ దాని గురించేనా?
తరచూ ఏదో ఒక ఇష్యూతో రగిలిపోతూ ఉండే పశ్చిమాసియా తాజాగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధంతో మరింత రగిలిపోయే పరిస్థితి. ఇరాన్ నుంచి క్షిపణులు ఇజ్రాయెల్ మీద దూసుకెళ్తున్నాయి. మరోవైపు ఇరాన్ కు సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ. చేయకూడని తప్పు చేస్తున్నట్లుగా హెచ్చరిస్తున్నారు. నిజానికి ఇరాన్-ఇజ్రాయెల్ మనకు వేలాది కి.మీ. దూరంలో ఉన్నాయి.
అయినా ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న యుద్ధంతో భారతదేశానికి కలిగే నష్టం ఏమిటి? అన్న లెక్కలు ఇప్పుడు మొదలు అయ్యాయి. భౌతికంగా ఈ రెండు దేశాల మనకు చాలానే దూరంలో ఉన్నా.. ఈ రెండు దేశాలతో మనకున్న ప్రత్యేక అనుబంధం కొత్త కష్టానికి దారి తీస్తుందని చెప్పక తప్పదు. కారణం.. మనం నిత్యం ఆధారపడే చమురు దిగుమతులు ఒక సమస్య కాగా.. గల్ప్ దేశాల్లో లక్షలాది మంది మనోళ్లు పనిచేస్తుండటం మరో అంశంగా చెప్పాలి.
తాజా యుద్ధం జరిగేది మనకు దూరంగా ఉండే రెండు బయటి దేశాలు అయినా ప్రభావం మాత్రం మన మీద పడుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఇంతకు మన మీద ఏమేం ప్రభావాలు చూపుతాయి అన్నది చూస్తే..
మన దేశంలో వినియోగించే డీజిల్ .. పెట్రోల్ సింహభాగం ఆధారపడేది పశ్చిమాసియా మీదనే. దాదాపు దిగుమతుల్లో 80 శాతం ఈ దేశాల నుంచే వస్తుంది. అక్కడి నుంచి చమురు సరఫరాలో ఇబ్బందులు తలెత్తితే మనకు సమస్యలు తప్పవు.
ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితలు నేపథ్యంలో చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే రవాణా ఛార్జీల మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
పశ్చిమాసియా నుంచి ఔషధాలు, మందులు, చమురు, సహజ వాయువు, ఎరువులు దిగుమతి అవుతుంటాయి. ప్రస్తుతం మన ద్వైపాక్షిక సంబంధం విలువ 16.36లక్షల కోట్లుగా ఉంది. అంతే కాదు గల్ప్ దేశాల నుంచి భారీగా పెట్టుబడులు వస్తుంటాయి. ఇక గల్ప్ దేశాల్లో దాదాపు 90 లక్షల మంది భారతీయులు పని చేస్తున్నారు. ఇప్పుడు తాజా యుద్ధ ప్రభావంతో ఈ అంశాలు అన్నీ ప్రభావితం అవుతాయి.