గుంటూరులో కమ్మ - కాపు సీట్లను తార్‌మార్ తక్కెడమార్ చేస్తున్న జగన్.. !
ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. 2019 ఎన్నికలలో ఏకంగా 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఈ ఏడాది జరిగిన ఎన్నికలలో కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయింది. అక్కడి వరకు బాగానే ఉంది. దారుణ ఓటమి తర్వాత వైసీపీ అధినేత జగన్ మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో ఇన్చార్జిలను మారుస్తున్నారు. ఎన్నికలకు ముందు కుండ మార్పిడి చేసిన చోట్ల తిరిగి ఇన్చార్జిలను మారుస్తున్నారు. ఈ క్రమంలోనే కీలకమైన గుంటూరు జిల్లాలో రెండు నియోజకవర్గాలలో అభ్యర్థులను పరస్పరం మార్చబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఆ రెండు సీట్లు వైసీపీలో కమ్మ, కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలవి కావటం విశేషం. పెదకూరపాడు నుంచి తాజా ఎన్నికలలో సెట్టింగ్ ఎమ్మెల్యే హోదాలో పోటీ చేసిన నంబూరు శంకరరావు ఓడిపోయారు. ఇప్పుడు నంబూరు శంకరరావును పెదకూరపాడు నుంచి మార్చి సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జిగా చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక సత్తెనపల్లి ఇన్చార్జిగా ఉన్న అంబటి రాంబాబును గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించారు. సత్తెనపల్లికి నంబూరు శంకరరావుని ఇన్చార్జిగా నియమిస్తే.. పెదకూరపాడుకు గుంటూరు మాజీ మేయర్ తాజా ఎన్నికలలో చిలకలూరిపేట నుంచి పోటీ చేసి ఓడిపోయిన కావటి మనోహర్ నాయుడు కు పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది.
నంబూరు శంకరరావు కమ్మ సమాజిక వర్గపు నేత కాగా.. కావటి మనోహర్ నాయుడు కాపు సామాజిక వర్గానికి చెందినవారు. గతంలో మనోహర్ నాయుడు 2019 ఎన్నికలకు ముందు పెదకూరపాడు వైసిపి ఇన్చార్జిగా కొంతకాలం పనిచేశారు. ఇక అంబటి రాంబాబును గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించడం వెనక కూడా.. ఆయనకు త్వరలోనే పొన్నూరు నియోజకవర్గ పార్టీ పగ్గాలు అప్పగించే వ్యూహం ఉందని ప్రచారం జరుగుతోంది.