జ‌గ‌న్‌కు ఆయ‌న కావాలా... మేం కావాలా... ఆ జిల్లా వైసీపీ నేత‌ల అల్టిమేటం..?

RAMAKRISHNA S.S.
 వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు ఒక జిల్లాకు చెందిన నాయకులు అందరూ అల్టిమేటం జారీ చేసిన పరిస్థితి. అసలు విషయంలోకి వెళ్తే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొందరు నేతలు చెలరేగిపోయారు. క్షేత్రస్థాయిలో మరో నాయకుడు ఎదగకుండా అంతా తామే అని చక్రం తిప్పారు. వారు అనుకున్నట్టుగా, వారు ఊహించినట్టుగా ఎన్నికల ఫలితాలు రాలేదు. అంతా తలకిందులు అయ్యాయి. దీంతో సదరు చక్రం తిప్పిన నాయకులకు పరిస్థితి ఎలా ఉన్నా పార్టీకి మాత్రం తీవ్ర ఇబ్బందిగా మారిపోయింది. ఇప్పుడు ఇలాంటి పరిణామం శ్రీకాకుళం జిల్లాలో కనిపిస్తుంది. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇక్కడ చివరి రెండున్నర సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు. జిల్లా పార్టీని త‌న కొనుసైగలతో శాసించారు.

అంతా తానే అయి చక్రం తిప్పారు. ఫలితంగా అప్పటివరకు బలమైన వాయిస్ వినిపించిన నాయకులు అందరూ పార్టీకి దూరమయ్యారు. గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన నియోజకవర్గాలలోను పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడు జిల్లా మొత్తం మీద పార్టీకి ఒక సీటు కూడా రాలేదని వాపోతున్నారు. అయితే జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు అందరూ జగన్‌కు అల్టిమేటం జారీ చేస్తున్నారు. ధర్మాన వంటి నాయకులకు ఇంకా పెత్తనం అప్పగించి ఆయనను కొనసాగిస్తే తాము కొనసాగలేమ‌ని క్షేత్రస్థాయిలో నాయకులు తేల్చి చెబుతున్నారు. ధర్మాన అనుసరించిన విధానాలతో పార్టీ భారీగా నష్టపోయిందని వారు చెబుతున్నారు.

జిల్లాలో అతిపెద్ద సామాజిక వర్గం కాళింగ‌ల‌కు అవకాశం ఇస్తే బలమైన ఎదుగుదల ఉంటుందని.. మెజార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. కానీ ధర్మానికి ఇంకా అవకాశం ఇవ్వటం.. ఆయన చెప్పినట్టే వినమని జగన్ చెప్పడంతో చాలామంది నాయకులు తర్జనభర్జన పడుతున్నారు. కేడర్ ఎవరితో సమన్వయం చేసుకోవాలో కూడా ఇప్పటి వరకు అధిష్టానం నుంచి స్పష్టత లేకపోవడంతో.. జిల్లా వైసీపీలో తీవ్రమైన గందరగోళ పరిస్థితి ఏర్పడింది. కాళింగ సామాజిక వర్గానికి చెందిన నాయకులకు జిల్లా పార్టీ పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని అంటున్నారు. ధర్మాన మాత్రం కాళింగ‌ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఎదిగేందుకు ఎంత మాత్రం అవకాశం ఇవ్వటం లేదన్న చర్చలు ఉన్నాయి. ఏది ఏమైనా ధర్మాన తీరుతో శ్రీకాకుళం జిల్లా వైసీపీలో ముసలం రాజుకుందని చెప్పాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: