కూట‌మి కుమ్ములాట‌ల్లో కొత్త ట్విస్ట్‌... ఇలా అయితే బాబుకు ముస‌ళ్ల పండ‌గే...!

RAMAKRISHNA S.S.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు దాటిందో.. లేదో.. అప్పుడే కుమ్ములాటలు మొదలైనట్టు కనిపిస్తోంది. అధికారంలోకి రావడం కోసం.. వైసీపీ అధినేత జగన్‌ను ఎలాగైనా గద్దె దించాలని గట్టిగానే కాదు.. పట్టుదలతో చేతులు కలిపారు. అంతా కలిసి అనుకున్నది సాధించారు. ఇక ఇప్పుడు అసలైన తేడాలు కనిపిస్తున్నాయి. పౌరపాలిటిక్స్ లో ఎవరికి వారు తమది పై చేయి ఉండాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో టీడీపీ మొత్తం 174 సీట్లకు గాను.. 144కి పోటీ చేసి కొన్ని సీట్లు వ‌దులుకుంది. 31 సీట్లను త్యాగం చేసింది. ఇపుడు ఆ 31 సీట్లలో మెజారిటీ సీట్లలో కుమ్ములాటలు స్టార్ట్ అయిపోయాయి. సహజంగానే గెలిచిన పార్టీ వారికి అధికారంలో ప్రయారిటీ ఉంటుంది. కానీ తాము కూటమి ధర్మం కోసం సీట్లు త్యాగం చేశాం.. కాబట్టి తమకు విలువ ఇవ్వాలన్నది తెలుగు తమ్ముళ్ల వాద‌నగా ఉంది.

పైగా గతంలో ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలలో చాలామంది.. ఎమ్మెల్యేలుగా పనిచేసి ఉన్నారు. దాంతో ఆ 31 నియోజకవర్గాలలో వారికి బలమైన కేడర్ ఉంది. అంతేకాదు వారికి అక్కడ పలుకుబడి ఉంది. అధికారులతో ఎలా ప‌నిచేయించుకోవాలో తెలుసు. ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రజా సమస్యలు కూడా బాగా తెలుసు. ఇలా తమకు మంచి పట్టు ఉన్న నేపథ్యంలో తమకు నియోజకవర్గాలలో పెద్దపీట వేయాల్సిందే అన్నది తమ్ముళ్ల వాదన. కానీ.. ఎమ్మెల్యేగా గెలిచిన జనసేన, బిజేపి వాళ్ళ వాద‌న‌ ఒకలా ఉంది. ఇప్పుడు అధికారం చుట్టూ అంతా తిరుగుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావడంతో తాము కూడా బలపడాలని చూస్తున్నారు.

దీంతో అగ్గిరాజుకుంటుంది. మేము ఎక్కువ ఉంటే మాదే ఆధిపత్యం అని అటువైపు వారు అంటున్నారు. ఎక్కడో ఎందుకు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గ పిఠాపురంలోనూ నేతల మధ్య సఖ్యత లేదు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే టిడిపి సీనియర్ నేత వర్మ కూటమీ ప్రభుత్వం గద్దెనెక్కిన తొలి నెల నుంచి అసంతృప్తితో ఉన్నారు. వర్మ వర్సెస్.. కాకినాడ జనసేన ఎంపీ ఉదయ్‌ శ్రీనివాస్ అన్నట్టుగా పిఠాపురం రాజకీయం సాగుతోంది. రాయలసీమలో ఆదోని నియోజకవర్గం లో బిజెపి ఎమ్మెల్యే పార్థసారథి, తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మధ్య గొడవ ముదిరిపాకనా పడింది. ఇలా దాదాపు అన్ని నియోజకవర్గాలలోను ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనా దీనికి చంద్రబాబు, పవన్ బ్రేకులు వేయకపోతే కూటమి కుమ్ములాటలు ప్రభుత్వ పరువును బజారున పడేసేలా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: