నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి షాక్.. ఇప్పట్లో జాబ్ నోటిఫికేషన్లు లేవ్.. !
తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను నిర్లక్షక్యం చేసింది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను విస్మరించింది. ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇంటికో ఉద్యోగం వస్తుందని ప్రకటించిన గులాబీ బాస్ కేసీఆర్ తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం అయ్యారు. కానీ ఇంటికో ఉద్యోగం హామీని మాత్రం గాలికొదిలేశారు.
పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ ఉద్యోగ నియామకాల్లో మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో నిరుద్యోగుల్లో వ్యతిరేకతను గుర్తించిన నాటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 2023 ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు కావొస్తోంది. మరో రెండు నెలలు అయితే ఏడాది కాలం పూర్తవుతుంది. కాన గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు పరీక్షలు, గత ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల ఫలితాలు వెలువరించి ఎల్బీ స్టేడియం వేదికగా నియామక పత్రాలు అందిస్తూ తామే వాటిని భర్తీ చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ సొంతంగా ఇచ్చిన నోటిఫికేషన్ డీఎస్సీ, ఇటీవల మెడికల్ , ఫార్మసీ ఉద్యోగాలవి మాత్రమే. అయితే ఇంతలోనే నోటిఫికేషన్ల జారీ నిలిపి వేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
తెలంగాణలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లపై సీఎం కీలక ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణ పై సుప్రీం కోర్టు రాష్ట్రాలకు అధికారం ఇచ్చిన నేపథ్యంలో ఆ మేరకు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు ఏకసభ్య కమిషన్ నియమించాలని నిర్ణయించారు. ఈ కమిషన్ 60 రోజుల్లో నివేదిక సమర్పించేలా చూడాలని సూచించారు. కమిషన్ నివేదిక ఆధారంగా.. అంటే రెండు నెలల పాటు కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఉండవని స్పష్టం చేవారు. ఏకసభ్య కమిషన్ నివేదిక ఆధారంగా కొత్త ఉద్యోగ ప్రకటనలు ఉంటాయని తేల్చి చెప్పారు. ఏడాదిలో 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి.. ఇప్పుడు నోటిఫికేషన్లుకు బ్రేకులు వేయడంతో నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది.