ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ మీద గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత గాడిన పడటంతో ఇక సూపర్ సిక్స్ హామీల అమలుపై ఆయన ఫోకస్ పెట్టినట్లు తెలిసింది.దీపావళి నుంచి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రవేశ పెట్టిన తర్వాత వారికి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంపై కూడా త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనున్నారని తెలిసింది. ఆర్థిక శాఖ అధికారులకు ఆయన ఇప్పటికే ఈ మేరకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. ప్రతి నెల ఒకటోతేదీన పింఛన్లు, ప్రభుత్వ ఉద్యోగాల వేతనాలకు ఇబ్బంది కలగకుండా తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు.ఈ నేపథ్యంలోనే డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కేంద్ర పథకం పీఎంఎఫ్‌ఎంఈని రాష్ట్రంలో మహిళ ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం అనుసంధానించనుంది. డ్వాక్రా సంఘాల్లో ఉంటూ ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్ ఆసక్తి ఉన్న మహిళలకు కేవలం 6 శాతం వడ్డీకి రూ.40 వేల చొప్పున రుణం మంజూరు చేయనుంది. దీన్ని రెండేళ్లలో చెల్లించాలి. ఈ ఏడాది 10 వేల మందికి అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారంలో ఉన్న 6,400 మంది మహిళలను ఇప్పటికే ఎంపిక చేశారు. మిగత 3,600 మంది అర్హుల ఎంపిక కూడా చేపట్టారు.కేంద్రం రూ.40 కోట్లు విడుదలకు అనుమతి ఇవ్వగా, వారం రోజుల్లోనే మహిళల ఖాతాలో డబ్బులు జమ కానున్నాయి. 2024- 25 ఏడాదికిగాను ఈ ఈవెంట్ కింద కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి రూ.40 కోట్లు అందించనుంది. పీఎమ్ఎఫ్ఎమ్ఈ కింద ఎంపిక చేసిన మహిళలకు వారి బిజినెస్‌ను మరింత పెంచుకునేందుకు స్త్రీ నిధి సంస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 6 శాతం వడ్డీకే రూ.40 వేల లోన్‌ను అందిస్తుంది. తీసుకున్న రుణాన్ని రెండేళ్ల వ్యవధిలో చెల్లించాలి. ఇలా చెల్లించిన వారికి మరింత ఎక్కువగా రుణాన్ని తక్కువ వడ్డీకే ఇస్తారు.ఇదిలావుండగా పేదరికం నిర్మూలన కోసం సంక్రాంతి పండగ నుంచి పీ-4 ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు కూడా చంద్రబాబు ప్రకటించారు. విపక్షాల విమర్శలకు ఒక చోటివ్వకుండా వెంట వెంటనే సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని గట్టిగానే నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలులో ఆలస్యం అయితే ప్రజలలో కొంత అసంతృప్తి నెలకొంటుందని, స్థానిక సంస్థలలో కొంత ఇబ్బందులు జరిగే అవకాశముందని భావించి ఆయన క్విక్ డెసిషన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు కూడా స్థానిక ప్రజల నుంచి కొంత వత్తిడిని ఎదుర్కొంటుండటం కూడా సూపర్ సిక్స్ హామీల అమలును వేగంగా చేయాలని నిర్ణయించుకున్నారు.