దేవినేని అవినాష్‌పై పెద్ద బాధ్య‌తే పెట్టిన జ‌గ‌న్‌... !

RAMAKRISHNA S.S.
- ( విజ‌య‌వాడ - ఇండియా హెరాల్డ్ )
దేవినేని అవినాష్ ఉమ్మడి కృష్ణా జిల్లాలో కాకలు తీరిన దివంగత రాజకీయ యోధుడు అయిన దేవినేని నెహ్రూ రాజకీయ వారసుడుగా రాజకీయాల్లోకి వచ్చారు. దురదృష్టం ఏంటంటే అవినాష్ గత మూడు ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్న మూడుసార్లు ఓడిపోతూ వస్తున్నారు. బలమైన తండ్రి నెహ్రూ రాజకీయ వారసత్వం... ఆర్థికంగా ..సామాజికంగా బలంగా ఉండటం... ప్రజలకు ఏదో చేయాలన్న సంకల్పం ... రాజకీయాల్లో ఎదగాలన్న కోరిక.... కష్టపడే తత్వం అన్ని ఉన్నా కూడా అవినాష్‌కు కాలం కలిసి రావడం లేదు. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు కూడా ఈ తండ్రి కొడుకులు వెనుకాడ లేదు. అతిపెద్ద రిస్క్‌ చేసి విజయవాడ పార్లమెంటుకు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఏకంగా 55 వేల ఓట్లు తెచ్చుకున్నారు. అనంతరం టిడిపిలోకి వెళ్లి రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా పని చేయడంతో పాటు గుడివాడలో బలంగా ఉన్న కొడాలి నాని మీద తెలుగుదేశం నుంచి పోటీ చేసేందుకు ఎవరు ముందుకు రాని పరిస్థితులలో పోటీ చేసి భారీగా ఖర్చుపెట్టి ఓడిపోయారు.

అనంతరం వైసిపి కండువా కప్పుకుని తన సొంత నియోజకవర్గమైన విజయవాడ తూర్పు ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టడంతో పాటు ఈ ఏడాది జరిగిన ఎన్నికలలో వైసీపీ నుంచి తూర్పులో ఓడిపోయారు.. పార్టీ మారినప్పటి నుంచి జగన్ చాలా ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. వైసీపీలో కృష్ణా జిల్లాలో మంత్రులు ..ఎంపీలు, మాజీ మంత్రులు ఎంతోమంది సీనియర్ నేతలు ఉన్న ఎవరికి లేని ప్రాధాన్యత అవినాష్‌కు జగన్ దగ్గర దక్కుతూ వచ్చింది. అవినాష్ ఏ పనికి నిధులు కావలసిన జగన్ ఎప్పుడు అడ్డు చెప్పలేదు. ఏ పని అడిగినా చేసుకుంటూ వచ్చారు. ఇక ప్రభుత్వ వ్యతిరేక గాలులలో అవినాష్ ఓడిపోయారు. అవినాష్ ఓడిపోయినా కూడా జగన్ అవినాష్ మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. కీలకమైన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్ష పగ్గాలు అవినాష్‌కే కట్టబెట్టారు.

కీలకమైన కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. పైగా కృష్ణా జిల్లాలో కమ్మ సామాజిక వర్గం రాజకీయంగా ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటుంది. అలాంటి జిల్లాలో కమ్మ‌ సామాజిక వ‌ర్గం నుంచి అవినాష్ రాజకీయంగా వైసీపీలో పట్టు సాధించడంతో పాటు అందరిని సమన్వయం చేసుకుంటూ మరియు ముఖ్యంగా తన సామాజిక వర్గాన్ని వైసీపీ వైపు టర్న్ చేసే విషయంలో చాలా సక్సెస్ కావాల్సి ఉంటుంది. కీల‌క‌మైన బెజ‌వాడ న‌గ‌రంతో పాటు జిల్లా మొత్తం మీద వైసీపీని ముందుండి న‌డిపించ‌డంలో ఒంటి చేత్తో కీల‌క పాత్ర పోషించాలి. ఏదేమైనా జగన్ అవినాష్‌కు పెద్ద టాస్కే పెట్టారు అని చెప్పాలి.. కానీ అవినాష్ ఈ విషయంలో సక్సెస్ అయితే రేపు వైసిపి అధికారంలోకి వస్తే అవినాష్‌కు జగన్ దగ్గర ఇప్పుడు ఉన్న ప్రాధాన్యత డబుల్ లేదా అంతకుమించి అవుతుందని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: