సజ్జలకు షాక్.. లుక్ అవుట్ నోటీసులు జారీ? అరెస్టుకు రంగం సిద్ధం..!
వైసీపీ సలహాదారుడు, జగన్ ప్రభుత్వం హయాంలో సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డికి మైండ్ తిరిగిపోయే షాక్ తగిలింది. సజ్జల రామకృష్ణారెడ్డి పై లుక్ అవుట్ నోటీసు జారీ అయినట్టు తెలుస్తోంది. సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు వైసీపీ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురాంపై కూడా లుక్ అవుట్ నోటీసులు జారీ అయినట్టు చెబుతున్నారు. లుక్ అవుట్ నోటీస్ కారణంగా ఢిల్లీ ఎయిర్ పోర్టులో సజ్జల రామకృష్ణారెడ్డిని అడ్డుకున్నారన్న వార్తలు తాజాగా వస్తున్నాయి. ముంబై హీరోయిన్ కాదంబరి జెత్వానీపై వేధింపుల కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపణలు ఎదుర్కుంటున్నారు .. అలాగే టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో దేవినేని, తలశిల, లేళ్ల అప్పిరెడ్డి నిందితులుగా ఉన్నారు. తనకు ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తనమీద లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారని సజ్జల వాపోతున్నట్టు తెలుస్తోంది.
రెండురోజుల కిందట విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించినట్టు కూడా తెలుస్తోంది. ఈ క్రమంలో ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. దీనిపై సజ్జల వాదన మరోలా ఉంది. తాను విదేశాలకు వెళ్లలేదని, దేశంలోని వివిధ ప్రాంతాల్లో తాను పర్యటిస్తున్నానని ఎందుకు అడ్డుకున్నారని ఎయిర్‌పోర్టు అధికారులను ప్రశ్నించారు. విదేశాలకు వెళ్తున్నట్లు తమ వద్ద సమాచారం ఉందని, దాన్ని ఆధారంగానే అడ్డుకోవాల్సి వచ్చిందన్నారు అధికారులు. దేశంలో ఎక్కడికి వెళ్లినా తమకు అభ్యంతరం లేదని, దానికి సంబంధించిన టికెట్లు వివరాలు ఇవ్వాలని కోరారు. దీంతో చిన్న వాగ్వాదం జరిగినట్టు అంతర్గత సమాచారం.
ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడం సాధారణమని, రెండురోజుల కిందట జారీ చేయలేదన్నాయి. గత నెలలో సజ్జలకు లుక్ అవుట్ నోటీసు లు జారీ చేశామని అంటున్నాయి. కావాలనే కూటమి ప్రభుత్వం పై దుమ్మెత్తిపోస్తున్నారని అంటున్నాయి. కొద్దిరోజుల కిందట అమెరికా వెళ్లాలని సజ్జల నిర్ణయించారట. వైసీపీ కార్యకర్తల మాట మరోలా ఉంది. ప్రతీ ఏడాది సజ్జల విదేశాలకు వెళ్తారని, అందులో భాగంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు వెళ్లారని అంటున్నారు. ప్రస్తుతం సజ్జల హైదరాబాద్‌లో ఉన్నారు. మంగళవారం సాయంత్రం తాడేపల్లికి రానున్నారు. ఈ లెక్కన సజ్జల.. ఢిల్లీ ఎయిర్‌పోర్టుకి వెళ్లడానికి కారణమేంటి అనేది తెలియాల్సివుంది.