ఆంధ్ర పొలిటికల్ లవర్ బోయ్ కథ ఇక ముగిసినట్టేనా?
అతను ఐదారు సార్లు ఎమ్మెల్యేగానో లేదా ఎంపీగానో గెలిచిన పెద్దనాయకుడేం కాదు. సరే, విపరీతమైన బ్యాక్గ్రౌండ్ ఉన్న నాయకుడంటే అదీ లేదు. కానీ, ఆంధ్ర పొలిటికల్ లవర్ బోయ్ అనగానే చటుక్కున అందరికీ గుర్తొచ్చే పేరు దువ్వాడ శ్రీనివాస్. అవును, దువ్వాడ తన దూకుడు స్వభావంతో మొదట శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు. సరిగ్గా అదే తరుణంలో కుటుంబ వివాదం, ప్రేమ వ్యవహారంతో… తెలుగు రాష్ట్రాల్లోనే మోస్ట్ పాపులర్ పొలిటికల్ లవర్ బాయ్‌గా అవతరించాడు.
పైపెచ్చు, ఏపీలో ప్రభుత్వం ఎప్పుడైతే మారిందో అప్పటినుండి శ్రీనివాస్ పేరు ఒకవైపు మీడియాలో, మరోవైపు సోషల్ మీడియాలో మార్మోగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఈ లేటు వయసు లవర్‌బాయ్.. రాజకీయ భవిష్యత్తు ఏమిటన్న దానిపై ఇపుడు వైసీపీలో వర్గాల్లో సందిగ్ధత నెలకొంది. కొన్నేళ్లుగా ప్రత్యక్ష రాజకీయాల్లో గెలుపుకోసం పరితపిస్తున్న దువ్వాడ శ్రీనివాస్, తెలిసి చేసాడో తేలిక చేసాడో తెలియదు కానీ ప్రేమలో అయితే బక్కబోర్లా పడ్డాడు. నారి నారి నడుమ మురారి టైపులో బాగా ఫేమ్ అయితే వచ్చేసింది. కానీ సొంత వైసీపీ పార్టీలోనే కొంతమంది ఆయన లవ్వు వ్యవహారంపైన గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.
దువ్వాడ శ్రీను, భార్య వాణి. చాలా సంప్రదాయమైన వ్యక్తి. ప్రేయసి దివ్వల మాధురి గురించి అందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కాకరేపిన ఈ కుటుంబ వ్యవహారం.. దువ్వాడ వాణి సైలెంట్ అయిపోయాక మరో టర్న్ తీసుకున్నట్టు కనబడుతోంది. మాధురి, శ్రీనివాస్ లు వ్యవహరిస్తున్న తీరు ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఇపుడు అదే అంశం పొలిటికల్‌గా దువ్వాడకు దెబ్బ కొట్టేటట్టు ఉందని పొలిటికల్ విశ్లేషకులు అంటున్నారు. వాణి, సైలెంట్‌గా తమకి న్యాయం కావాలని పోరాటం చేస్తుంటే.. ప్రియురాలు మాధురితో శ్రీనివాస్ టూర్ లు వేస్తూ, రీల్స్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే రాజకీయంగా మరీ పలచనవుతున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.